రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వచ్చే ఏడాది నవంబర్ లో జరిగే ఎన్నికల కోసం పార్టీలు సమాయాత్తం అవుతున్నాయి. ఈ దఫా రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ రసవత్తరంగా సాగుతోంది. మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆసక్తి చూపుతుండగా ఆయన వ్యవహార శైలిని పార్టీ సహచరులే ఈసడించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేసేనేదుకు నేతలు పోటీ పడుతున్నారు.
తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరిగిన తొలి చర్చ తర్వాత భారత సంతతి మల్టీ మిలియనీర్ వివేక్ రామస్వామి (38) పేరు మార్మోగుతున్నది. విరాళాల రూపంలో ఆయనకు విశేష ఆదరణ లభిస్తున్నది. తొలి బహిరంగ చర్చ ముగిసిన గంటలోనే రూ. 4.5 కోట్లు విరాళంగా అందుకొన్నారని వివేక్ రామస్వామి ప్రచారం బృందం వెల్లడించింది.
రిపబ్లిక్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా 8 మంది పోటీపడుతున్నారు. ఇందులో భారత సంతతి మహిళ నిక్కీ హేలీ కూడా ఉన్నారు. తొలి చర్చలో ట్రంప్ గైర్హాజరీ కావడంతో వివేక్ కీలకంగా నిలిచినట్టు కథనాలు ప్రచురితమయ్యాయి.