బెంగుళూరు – చంద్రయాన్-3ని విజయవంతం చేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. దక్షిణాఫ్రికా, గ్రీస్ దేశాల పర్యటన నుంచి వచ్చిన మోడీ నేరుగా బెంగళూరు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టు వద్దకు చేరుకున్న అభిమానులకు అభివాదం చేసిన ప్రధాని . అక్కడి నుంచి ఇస్రో కార్యాలయానికి వెళ్లారు. అక్కడ శాస్త్రవేత్తలను మోడీ అభినందించారు. ఈ సందర్భంగా ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించిన వివరాలను ప్రధాని కి వివరించారు.
అంతరిక్ష రంగంలో భారత్ చరిత్ర సృష్టించిందని.. ఎవరు సాధించలేని విజయాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు సాధించారన్నారు. ఆగస్టు 23ను నేషనల్ స్పేస్ డేగా ప్రకటించారు ప్రధాని మోదీ. ఇస్రో శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేస్తున్నాను అంటూ భావోద్వేగానికి గురయ్యారు. తాను సౌతాఫ్రికాలో ఉన్నా తన మనసంతా ఇక్కడే ఉందని.. చంద్రయాన్ విజయం దేశ ప్రజల్లో సంతోషాన్ని కలిగించిందన్నారు. ఇస్రో సైంటిస్టుల్ని కలవడానికి ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూశాను అన్నారు.
చంద్రయాన్-3 సక్సెస్‌లో ఎంతో మంది మహిళా శాస్త్రవేత్తలు పాత్ర ఉన్నదని ప్రధాని మోదీ కొనియాడారు. బెంగుళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ కార్యాలయంలో వారిని ఆయన కలిశారు. మహిళల పాత్ర అనిర్వచనీయమని ఆయన అభినందించారు. మహిళ శాస్త్రవేత్తల్ని ప్రధాని మెచ్చుకున్నారు. వారితో కలిసి గ్రూపు ఫోటో కూడా దిగారు. విక్రమ్ ల్యాండైన ప్రాంతాన్ని శివశక్తిగా ప్రధాని మోదీ నామకరణం చేసిన విషయం తెలిసిందే.
చంద్రయాన్ 3 విజయవంతంలో మహిళా శాస్త్రవేత్తల పాత్ర ఎంతో ఉందని.. మన దేశ నారీ శక్తి ఏమిటో ప్రపంచానికి మరోసారి చాటామన్నారు. ప్రధాని అభినందనలతో మహిశా శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ తమను మెచ్చుకోవడం సంతోషంగా ఉందని రీమా ఘోస్ తెలిపారు. ప్రజ్ఞాన్ రోవర్ బృందంలో ఆమె పనిచేస్తున్నారు. ప్రజ్ఞాన్ తనకు ఓ బేబీ లాంటిదని, మూన్‌పై ఆ బేబీ స్టెప్పులేస్తున్నట్లు ఆమె తెలిపారు. చంద్రుడిపై రోవర్ తిరగడం ఆనందంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో మార్స్, ఆదిత్య మిషన్లు చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు.
శివశక్తి, తిరంగా పేర్లను పెట్టడం సంతోషంగా ఉందని ఇంజినీర్ పద్మావతి తెలిపారు. ప్రధాని మోదీ తమ కార్యాలయానికి వచ్చి అభినందించడం ఆనందంగా ఉందన్నారు. ప్రధాని తమలో ఎంతో స్పూర్తిని నింపారన్నారు. మేమంతా గర్వంగా ఫీలవుతున్నామని ఇస్రో మహిళా ఇంజినీర్ సరితా రెడ్డి తెలిపారు.
ప్రధాని మోదీతో కలిసి మాట్లాడడం చాలా సంతోషించదగ్గ విషయమని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ శాస్త్రవేత్త తెలిపారు. నారీ శక్తిని గుర్తించి, ప్రోత్సహించడం సంతోషంగా ఉందని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ శాస్త్రవేత్త ప్రియాంకా మిశ్రా తెలిపారు. ల్యాండర్, రోవర్‌కు చెందిన ప్రొపల్షన్ మాడ్యూల్‌కు ఆమె పనిచేసింది.
గగన్‌యాన్ ప్రాజెక్టుకు చంద్రయాన్ సక్సెస్ పెద్ద ప్రేరణగా నిలుస్తుందని ఇంజినీర్ ఆర్తీ సేన్ తెలిపారు. మార్క్ 3 రాకెట్‌ను మరింత శక్తివంతంగా మార్చాల్సిన సమయం దగ్గరపడిందన్నారు. గగన్‌యాన్‌కు కూడా ప్రతి ఒక్కరి సపోర్టు కావాలని ఆమె ఆకాంక్షను వ్యక్తం చేశారు.