Saturday, November 23, 2024
HomeTrending Newsన్యాయవ్యవస్థకు సహకారం లేదు: రమణ

న్యాయవ్యవస్థకు సహకారం లేదు: రమణ

తీర్పులు తమకు అనుకూలంగా రాకపోతే న్యాయవ్యవస్థను, వ్యక్తిగతంగా జడ్జిల ప్రతిష్టను దెబ్బతీసే పోకడ దేశంలో మొదలైందని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయమూర్తులకు స్వేఛ్చ లేకుండా పోతోందని, సిబిఐ, ఐబీ లాంటి వ్యవస్థలు కూడా న్యాయవ్యవస్థకు సహకరించడంలేదని అయన వ్యాఖ్యానించారు. ఇది చాల తీవ్రమైన అంశమని, తాను అత్యంత బాధ్యతతో ఈ విషయాన్ని చెబుతున్నట్లు జస్టిస్ రమణ అన్నారు. ఏదైనా విషయంలో న్యాయమూర్తులు ఫిర్యాదు చేసినా సిబిఐ, పోలీసు శాఖలు తగిన విధంగా స్పందించడంలేదని అయన అసహనం వ్యక్తం చేశారు.

జూలై 28న జార్ఖండ్ ధన్ బాద్ జిల్లా అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి ఉత్తమ ఆనంద్ ను మైనింగ్ మాఫియా ఆటో తో గుద్దించి హత్యకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన జార్ఖండ్ హైకోర్టు ఈ ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.  సుప్రీంకోర్టు కూడా ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించి సుమోటో గా విచారణకు స్వీకరించింది.  ఈ కేసు విచారణం సందర్భంగా జస్టిస్ రమణ ఘాటు  వ్యాఖ్యలు చేశారు.  న్యాయమూర్తుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 17 లోపు వివరాలు అందజేయాలని సూచించింది.

ఉత్తమ్ ఆనంద్ హత్య కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని, ఇప్పటికే ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని జార్ఖండ్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలియజేసింది. కేసు తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది ధర్మాసనం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్