చైనా మరోసారి రెచ్చగొట్టే చర్యలకు దిగింది. అరుణాచల్ ప్రదేశ్, అక్సాయిచిన్ ప్రాంతాలను చైనా తన జాతీయ భూభాగాలుగా ప్రకటించింది. దీనికి సంబంధించి అధికారిక మ్యాప్‌ను సోమవారం విడుదల చేశారు. చైనా సహజ వనరుల శాఖ ‘2023 ఎడిషన్ ఆఫ్ ది స్టాండర్డ్ మ్యాప్ ఆఫ్ చైనా’ పేరుతో ఈ మ్యాప్‌ను రూపొందించింది. డిజిటల్, నావిగేషన్ మ్యాప్‌లను కూడా విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వ మీడియా తెలిపింది. దేశ సరిహద్దులు.. భూభాగాలను చూపుతూ ఈ మ్యాప్ తయారు చేయగా, అందులో భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్, అక్సాయిచిన్ ప్రాంతాలను తమ దేశ భూభాగాలుగా చూపించారు. గతంలో విడుదల చేసిన ఎడిషన్‌లో, తైవాన్ మరియు దక్షిణ చైనా సముద్రం అంతా తమకే చెందుతుందని ప్రకటించింది.
తాజా సంచికలో అరుణాచల్ ప్రదేశ్ లోని 11 ప్రాంతాల పేర్లను ప్రామాణికంగా తీసుకుని మ్యాప్ రూపొందించడం గమనార్హం. ఇలా అరుణాచల్ రాష్ట్రంలోని గ్రామాల పేర్లను మార్చి చైనా మ్యాపులు విడుదల చేయడం ఇది మూడోసారి. మరికొద్ది రోజుల్లో జీ20 సదస్సు జరగనున్న వేళ.. మ్యాపు అంశంపై భారత్ ఎలా స్పందిస్తుందోనని పరిశీలకుల్లో ఆసక్తి నెలకొంది. దేశ సరిహద్దుల నిర్వహణకు గత ఏడాది అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రత్యేక సరిహద్దు చట్టాన్ని రూపొందించారు.