ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో నేటి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై శ్రీలంక ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. పల్లెకెలె ఇంటర్నేషనల్ స్టేడియం లో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 4 పరుగుల వద్ద ఓపెనర్ తాన్జిద్ హాసన్ (డకౌట్) వికెట్ కోల్పోయింది. లంక బౌలర్లు విజృంభించడంతో 164 పరుగులకే బంగ్లా చాపచుట్టేసింది. నజ్ముల్ హోస్సేన్ శాంటో ఒకడే 89 పరుగులతో రాణించాడు. మొత్తం నలుగురు బ్యాట్స్ మెంట్ మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు.
లంక బౌలర్లు మతీష పథిరణ 4; మహీశ తీక్షణ 2; ధనుంజయ డిసిల్వా, దునిత్ వెల్లలెగే, దాసున్ శనక తలా ఒక వికెట్ పడగొట్టారు.
లక్ష్యం స్వల్పమే అయినా శ్రీలంక తడబడి 43 పరుగులకే మూడు వికెట్లు (కరుణరత్నే-1; పాథుమ్ నిశాంక-14; కుశాల్ మెండీస్-5 ) కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో సమర విక్రమ-చరిత్ అసలంకలు కీలక భాగస్వామ్యం నమోదు చేశారు. సమర54 స్కోరు చేసి అవుట్ కాగా, అసలంక 62 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 39 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.
బంగ్లా బౌలర్లలో షకీబ్ అల్ హసన్ 2; తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లామ్, మేహిది హసన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
నాలుగు వికెట్లతో రాణించిన మతీష పథిరణ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.