అమెరికా పోలీసులు నల్లజాతి గర్భిణీ మహిళపై కాల్పులు జరిపి చంపారు. పోలీసుల బాడీ కెమెరాలో ఈ సంఘటన రికార్డ్ అయ్యింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కారులో ఉన్న నల్లజాతి గర్భిణీని కాల్చి చంపిన అమెరికా పోలీసులపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆగస్ట్ 24న ఓహియోలో ఈ సంఘటన జరిగింది. 21 ఏండ్ల తకియా యంగ్ ఒక కారులో స్టీరింగ్ వద్ద కూర్చొని ఉంది. కొంత మంది పోలీసులు ఆ కారును చుట్టుముట్టారు. ఒక దొంగతనం గురించి ఆమెను ప్రశ్నించారు. కారు నుంచి కిందకు దిగాలని డిమాండ్ చేశారు.
తాను ఏ దొంగతనం చేయలేదని ఆ మహిళ చెప్పింది. కారు నుంచి కిందకు దిగేందుకు ఆమె నిరాకరించింది. కారు ఎదురుగా ఉన్న పోలీస్ అధికారి ఆ మహిళ పైకి గన్ గురిపెట్టాడు. మరో పోలీస్ కారు డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. భయాందోళన చెందిన ఆ మహిళ కారును ముందుకు డ్రైవ్ చేసింది. దీంతో ఒక పోలీస్ గన్‌తో కాల్పులు జరిపాడు. బుల్లెట్ గాయం కావడంతో ఇద్దరు పిల్లల తల్లి, ఆరు నెలల గర్భిణీ అయిన నల్లజాతి మహిళ కారులో కుప్పకూలి మరణించింది. అమెరికా పోలీసుల బాడీ కెమెరాలో రికార్డైన వీడియో క్లిప్స్‌ను పోలీస్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అమెరికా పోలీసుల చర్యను నల్లజాతీయులు తప్పుపట్టారు. పోలీసులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ నిరసనలకు దిగారు. పోలీస్ అధికారులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఓహియో బ్యూరో ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.