మణిపూర్‌లో పరిస్థితి చక్కదిద్దేందుకు మాజీ ఆర్మీ నిపుణుల్ని కేంద్రం రంగంలోకి దింపుతున్నది. మయన్మార్‌లో భారత సైన్యం (2015లో) చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్‌కు నేతృత్వం వహించిన కర్నల్ (రిటైర్డ్) నెక్టార్ సంజేన్‌బామ్‌కు మణిపూర్ పోలీస్ విభాగంలో సీనియర్ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు అప్పగించింది. ఐదేండ్లపాటు ఆయన విధుల్లో ఉంటారని తెలుపుతూ మణిపూర్ హోం శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.
కొన్ని నెలలుగా అల్లర్లతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో ఇంకా పరిస్థితులు సద్దుమణగడం లేదు. ఇంఫాల్‌లోని న్యూ లాంబూలానేలో కుకీ తెగకు చెందిన మిగిలిన 10 కుటుంబాలను ప్రభుత్వం అక్కడి నుంచి తరలించింది. కుకీల ప్రాబల్యం అధికంగా ఉన్న కాంగ్‌పోపి జిల్లా మోట్‌బంగ్‌లో వారికి ఆశ్రయం కల్పించినట్టు ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. దశాబ్దాలుగా ఇక్కడ నివాసం ఉంటున్న తమను ప్రభుత్వం బలవంతంగా తరలించిందని బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. విద్వేషాలు పెరగకుండా ఉండేందుకే కుకీ కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు మణిపూర్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు ఇంఫాల్‌లోని ఇద్దరు మైతీ న్యాయవాదుల ఇండ్లు, ఆఫీసు చాంబర్లపై గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. మైతీ వర్గంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ప్రొఫెసర్ ఖామ్‌ఖాన్ సాన్ హాసింగ్ తరఫున ఓ కేసులో చిత్తరంజన్, ఛోంగ్తామ్ వాదనలు వినిపించటాన్ని వ్యతిరేకిస్తూ దుండగులు ఈ దాడికి తెగబడ్డారని సమాచారం. గత శుక్రవారం దుండగుల గుంపు ఒకటి ఇంఫాల్‌లోని తన ఇంట్లోకి చొరబడి విధ్వంసానికి పాల్పడిందని లాయర్ చిత్తరంజన్ తెలిపారు.