Friday, September 20, 2024
HomeTrending NewsManipur: మణిపూర్ లో ఆరని మంటలు...

Manipur: మణిపూర్ లో ఆరని మంటలు…

మణిపూర్ లో మే 3వ తేదిన మొదలైన హింస ఇంకా కొనసాగుతోంది. కుకి, మైతేయి వర్గాలు పరస్పర దాడులకు తెగబడుతున్నాయి. ఆంగ్లేయుల కాలంలో మొదలైన వైరం ఇప్పుడు తారా స్థాయికి చేరుకుంది. రాజకీయ పార్టీలు రెండు తెగల వైరాన్ని రాజకీయ లబ్ది కోసం మత కోణంలోకి మార్చాయి.

కొండ ప్రాంతాల్లో నివసించే కుకీలు మొదటి నుంచి సాయుధులై వేర్పాటువాదాన్ని అనుసరిస్తున్నారు. మయన్మార్ నుంచి దొంగచాటుగా ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్న కుకీలు మొదటి నుంచి తిరుగుబాటు ధోరణి లోనే ఉండగా.. మైతేయిలు మైదాన ప్రాంతాల్లో మణిపురం భూమి పుత్రులుగా శాంతియుతంగా జీవనం కొనసాగిస్తున్నారు.

మణిపూర్ రాష్ట్రానికి తూర్పున మయన్మార్ తో సరిహద్దు కాగా… 400 కిలోమీటర్ల సరిహద్దులో కేవలం పదిశాతం మాత్రమె కంచే వేశారు. మిగతా ప్రాంతం అటవీ, కొండలు కావటంతో అలాగే వదిలేశారు. ఈ అటవీ, కొండ ప్రాంతాలు కుకీలకు కొట్టిన పిండి. మయన్మార్ కు వెళ్లి రావటం వారికి సాధారణం. ఈ ప్రాంతం నుంచే సంఘ వ్యతిరేక శక్తులు మణిపూర్ లో చొరబడుతున్నాయి. మయన్మార్ తో కుకీలకు పెళ్లీలు..పెరంటాల సంబంధాలుగా బంధుత్వాలు కూడా ఉన్నాయి.

మొదట ఉపాధి కోసం మొదలైన గంజాయి సాగు ఆ తర్వాత విలాసాల కోసం విచ్చలవిడిగా సాగుతోంది. ప్రశ్నించిన ప్రభుత్వ అధికారులను హతమార్చిన సందర్భాలు ఉన్నాయి. మయన్మార్ మీదుగా అంతర్జాతీయ మార్కెటుకు గంజాయి తరలించటం…మన దేశంలో ఢిల్లీ వరకు సరఫరా చేసే నెట్వర్క్ నిర్మాణం జరిగింది.

తాజాగా కుకి, మైతేయి గొడవలతో ఈ వ్యవహారం బయటపడే ప్రమాదం ఉందని…కొండ ప్రాంతాలకు మీడియాను కూడా అనుమతించలేదు. ఆయుధ శిక్షణలో ఆరితేరిన కుకీలు మొదటగా అల్లర్లను ఎగదోశారు. మైతేయిలు పోలీసు స్టేషన్ ల నుంచి ఆయుధాలు లూటీ చేసినా వాటిని ఉపయోగించటం తెలియక చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. కుకిల్లో ఒకో కుటుంబం ఒకరుగా కాపలాకు సాయుధులై వచ్చేవారు. మొదటి వరుసలో స్త్రీలను రక్షణ కవచంగా ఉంచి.. వారిని దాటుకుని వస్తే దాడులు.. భౌతిక దాడులు చేసేందుకు పురుషులు ఉండేవారు.

ఇలాంటి వాస్తవాలు ఎన్నో ఉన్నా రాజకీయ పార్టీలు కేవలం తమ స్వార్థం కోసం మతం రంగు పులిమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు యత్నించాయి. అందుకు ఓ వర్గం మీడియా బలంగా సహకరించింది.

మణిపూర్ హింసకు సంబంధించి తాజాగా పోలీసు శాఖ వివరాలు వెల్లడించింది. హింస చెలరేగినప్పటి నుంచి ఇప్పటి వరకూ 175 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు. 175 మందిలో ఇప్పటికీ గుర్తించని 96 మృతదేహాలు మార్చురీలో ఉన్నట్లు చెప్పారు. ఈ ఘర్షణల్లో 1,118 మంది గాయపడ్డారని.. సుమారు 33 మంది అదృశ్యమైనట్లు ఆ రాష్ట్ర పోలీసులు తెలిపారు.

రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై కొన్ని కీలక గణాంకాలను పోలీసు శాఖ తాజాగా విడుదల చేసింది. ఆ డేటా ప్రకారం.. ఈ హింసలో కనీసం 5,172 అగ్ని ప్రమాద ఘటనలు చోటు చేసుకున్నాయి. అందులో 4,786 ఇళ్లు, 386 మతపరమైన ప్రదేశాలకు (254 చర్చిలు, 132 దేవాలయాలు) అల్లరి మూకలు నిప్పు పెట్టారు. హింస ప్రారంభమైనప్పటి నుండి రాష్ట్ర ఆయుధగారం నుంచి 5,668 ఆయుధాలు లూటీకి గురయ్యాయి. అందులో 1,329 ఆయుధాలను భద్రతా బలగాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. అదేవిధంగా అల్లరి మూకల నుంచి 15,050 మందుగుండు సామగ్రి, 400 బాంబులు భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. రాష్ట్రంలో కనీసం 360 అక్రమ బంకర్లను భద్రతా బలగాలు ధ్వంసం చేశారు.

కుకీ, మెయిటీ కమ్యూనిటీల మధ్య నెలకొన్న ఘర్షణలతో దాదాపు నాలుగు నెలలుగా మణిపూర్‌ అట్టుడుకుతోంది. ఇప్పటికీ కొందరు అల్లరి మూకలు, నిషేధిత ఉగ్రవాదులు అక్కడక్కడా దాడులకు పాల్పడుతున్నారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్