ఆసియా కప్ -2023ని ఇండియా గెల్చుకుంది. నేడు ఏకపక్షంగా సాగిన ఫైనల్ లో శ్రీలంకపై పది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి కప్ ను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకూ 16 సార్లు ఆసియా కప్ టోర్నమెంట్ జరగ్గా నేటితో కలిపి ఎనిమిదిసార్లు ఇండియా విజేతగా నిలిచింది.
కొలంబో లోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక… ఇండియా బౌలర్ల ధాటికి, ముఖ్యంగా సిరాజ్ దెబ్బకు కుప్ప కూలింది. 15.2 ఓవర్లలో 50 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మొత్తం ఐదుగురు డకౌట్ కాగా, ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు (కుశాల్ మెండీస్-17; దుషాన్ హేమంత-13) చేయగలిగారు. సిరాజ్ ఆరు, హార్దిక్ పాండ్యా 3, బుమ్రా ఒక వికెట్ పడగొట్టారు.
ఈ లక్ష్యాన్ని ఇండియా వికెట్ నష్ట పోకుండా 6.1 ఓవర్లలోనే ఛేదించింది. ఇషాన్ కిషన్-23; శుభ్ మన్ గిల్ -27 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.
సిరాజ్ ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’, కుల్దీప్ యాదవ్ ‘ప్లేయర్ అఫ ద సిరీస్’ గెల్చుకున్నారు.