తెలంగాణ అంశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి ప్రస్తావించారు. ఈసారి కొంచెం సమతూకం పాటిస్తూ రాష్ట్ర విభజన అంశాన్ని స్పృశించారు. ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎక్కడ పార్టీకి నష్టం జరగకుండా జాగ్రత్త తీసుకున్నారు. పార్లమెంటు అమృత కాల సమావేశాల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు పాత పార్లమెంటు భవనంలో ప్రసంగించారు. పాత పార్లమెంటు భవనంలో ఈ రోజుతో ఆఖరుగా సమావేశాలు నిర్వహిస్తారు. ఇకనుంచి కొత్త భవనంలోనే సమావేశాలు జరుగనున్నాయి. ఈ రోజు సమావేశాలను ప్రారంభిస్తూ ప్రసంగించిన ప్రధానమంత్రి…బిజెపి హయంలో మూడు రాష్ట్రాలు శాంతియుతంగా ఏర్పాటు చేసిందన్నారు. రెండు ప్రాంతాల ప్రజలు సంబరాలు చేసుకున్నారని గుర్తు చేశారు.
దివంగత నేత, అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపాయి హయంలో ఛత్తీస్ గడ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాలు ఏర్పడ్డాయని… అప్పుడు జరిగిన విభజనలో ఎక్కడ ఆందోళనలు జరగలేదని… రెండు ప్రాంతాల ప్రజల సమ్మతితో శాంతియుతంగా కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.
తెలంగాణ ఏర్పాటు సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఏ హయంలో రెండు ప్రాంతాల్లో ఆల్లర్లు జరిగాయని ప్రధాని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతోమంది చనిపోయారని… అదే సమయంలో రాష్ట్రం విడిపోవద్దని ఆందోళనలు జరిగాయని ప్రధాని వివరించారు. అయితే ఇదే పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం పొందింది అని గుర్తు చేశారు. రెండు రాష్ట్రాలుగా ఏర్పడినా ఎక్కడా సంబరాలు చేసుకోలేదన్నారు.
గతంలో తెలంగాణ అంశం ప్రస్తావించినపుడు రాష్ట్ర విభజన సరిగా జరగలేదని ప్రధాని అన్నారు. ఆ వ్యాఖ్యలతో తెలంగాణలో నిరసనలు వ్యక్తం అయ్యాయి. కాంగ్రెస్ ను ఇరుకునపెట్టేందుకు విభజనపై ప్రధాని మాట్లాడగా… అది వికటించింది. దానికి ప్రతిస్పందన తెలంగాణలో విరుద్దంగా ప్రతిపలించింది. ప్రధాని ప్రసంగానికి తెలంగాణలో నిరసనలు వ్యక్తం అయ్యాయి. చివరకు బిజెపి జాతీయ నాయకత్వం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ప్రధాని వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి నేతలు విమర్శలు చేసి… రాజకీయంగా లబ్ది పొందే ప్రయత్నం చేశారు.
ఈ దఫా ప్రధాని నేరుగా కాంగ్రెస్ ను విమర్శించే దిశగా ఆంధ్రప్రదేశ్ విభజన అంశాన్ని ప్రస్తావించారు. ఓవరాల్ గా కాంగ్రెస్ పాలన దేశానికి మేలు చేయలేదని ప్రధాని విమర్శలు చేశారు.