సోషల్ మీడియా- మీడియాలో నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే ,మాజీ ఉప ముఖ్యమంత్రి టి .రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. లోటస్ పాండ్ దగ్గర అనిల్ కుమార్ ను నేను కలిసినట్లు అసత్య ప్రచారం చేశారని, గతంలో ఓ క్రైస్తవ సమావేశం సందర్భంగా కలిసిన ఫోటోను వైరల్ చేశారని తెలంగాణ భవన్ లో అన్నారు. వైఎస్సార్ పై నాకు అభిమానం ఉన్నది వాస్తవమేనని, వైఎస్ నాకు టికెట్ ఇచ్చి రాజకీయంగా ప్రోత్సహించారన్నారు. జగన్మోహన్ రెడ్డి తో కూడా నా సావాసం గతంలో ఉండేదని, తెలంగాణ కోసం జగన్మోహన్ రెడ్డి ని పక్కనబెట్టి బయటకు వచ్చానని రాజయ్య వివరించారు.
నేను రాజకీయ ఓనమాలు దిద్దింది కాంగ్రెస్ పార్టీ అయితే ఎదుగుదల మాత్రం టీఆరెస్ వల్లేనని, నా జీవితాంతం టీఆరెస్ పార్టీలోనే ఉంటానని రాజయ్య స్పష్టం చేశారు. దళితవాడల్లో నిద్రచేసి ఒక పుస్తకం రూపంలో సీఎంకు నేను ఇచ్చాను- ఇవ్వాళ దళితబంధు అమలు కావడం సంతోషకరంగా ఉందన్నారు. జనాభాలో 20శాతం ఉన్న దళితులకు వందశాతం న్యాయం జరగలేదనే సీఎం కేసీఆర్ ఇప్పుడు ఈ ఆలోచన చేశారని, ప్రభుత్వ పథకాల అమలు చేయడంలో టాప్ 5 ఎమ్మెల్యేల్లో 4వ స్థానం నాకు దక్కిందన్నారు.
నేను ఎలాంటి అసంతృప్తిలో లేను- చాలా తృప్తిగా ఉన్నానని, డిప్యూటీ సీఎం అయిందే ముఖ్యమంత్రి కేసీఆర్ వల్ల అన్నారు. నా చివరి ఊపిరి ఉన్నంత వరకు టీఆరెస్ పార్టీలోనే ఉంటానన్న రాజయ్య షర్మిలను నేను కలవలేదు- అలాంటి అవసరం రాలేదన్నారు.