హమాస్ దాడులు… ఇజ్రాయల్ ప్రతి దాడులతో పశ్చిమాసియా దేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇస్లామిస్ట్ ఉగ్రవాద సంస్థ హమాస్ వైఖరి చూస్తుంటే చావో రేవో అన్నట్టుగా ఉంది. అటు ఇజ్రాయల్ కూడా ఎవరు మరచిపోని రీతిలో హమాస్ కు బుద్ది చెపుతామని తెగేసి చెపుతోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో యూదు దేశ ప్రతినిధి ఇదే విషయం తేటతెల్లం చేశారు.
మారణకాండ తొందరగా సద్దుమణగకపోతే అంతర్జాతీయంగా కొత్త పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఐరోపా, అమెరికా దేశాలు ఇజ్రాయల్ కు మద్దతు ఇవ్వగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, టర్కీ తదితర ముస్లిం దేశాలు హమాస్ వెన్నంటి ఉన్నాయి. హమాస్ – ఇజ్రాయల్ వివాదంలో ప్రత్యక్షంగా ముస్లిం దేశం ఏది జోక్యం చేసుకున్నా విపరిణామాలు తప్పవు.
హమాస్ ఉగ్రవాదుల వేటలో ఇజ్రాయల్ డిఫెన్సు ఫోర్సు (IDF) బలగాలు
హమాస్ దాడులతో రగిలిపోతున్న ఇజ్రాయల్ ఎవరు చెప్పినా వినే పరిస్థితుల్లో లేదు. గాజాకు ఆహార, విద్యుత్, అత్యవసర సరుకులు అన్నింటిని బందు చేశారు. గాజాలో కార్దోన్ సెర్చ్ కు సైన్యం(IDF) రంగం సన్నద్ధం అయింది. హమాస్ అంతు తేల్చిన తర్వాత హిజ్బొల్ల పని పట్టేందుకు రంగం సిద్దం చేస్తున్నారు.
విదేశీయులను కూడా పొట్టనపెట్టుకోవటం హమాస్ కు ప్రతికూలంగా మారింది. నిన్నటి మొన్నటి వరకు పాలస్తీనా అని సంబోధించిన ప్రపంచ దేశాలు ఇప్పుడు హమాస్ అంటున్నాయి. పాలస్తీనా పేరుతో ఉచ్చరించినపుడు శరణార్థులు, వారి దీనావస్థ అంతర్జాతీయ సమాజాన్ని కదిలించేవి.
పాలస్తీనావాసులు హమాస్ రూపంలో దాడులకు దిగటంతో…ప్రపంచ దేశాల దృష్టి కోణం మారింది. మతోన్మాద శక్తులు, ఇస్లామిక్ ఉగ్రవాదులనే ఆలోచన బలపడుతోంది. తటస్థ దేశాలు కూడా ఇప్పుడు ఇజ్రాయల్ కు మద్దతు ఇస్తున్నాయి.
హమాస్ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయల్ పౌరులు
బందీలుగా ఉన్న మహిళలు, చిన్నారులను హమాస్ ఉగ్రవాదులు హింసించటం.. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వచ్చాయి. యూదు పౌరులను చంపితే సంబరాలు చేసుకుంటున్న పాలస్తీనా వాసుల వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి ఘటనలు పాలస్తీనాకు ప్రతికూల ఫలితాలు ఇస్తాయనే చెప్పాలి.
తమ పౌరులను హింసిస్తున్న హమాస్ ను కడతేర్చటం లక్ష్యమని ఇజ్రాయల్ ప్రధానమంత్రి నుంచి సైనికుల వరకు భీషణ ప్రతిజ్ఞలు చేస్తున్నారు. 50 ఏళ్ళుగా సాగుతున్న వివాదానికి ముగింపు పలుకుతామని యూదులు స్పష్టం చేస్తున్నారు. అదే నిజమైతే గాజా, వెస్ట్ బ్యాంకు ప్రాంతాలు త్వరలోనే మరుభూమిని తలపిస్తాయి.
తాజా ఘర్షణలతో గాజా ప్రాంతం పూర్తిగా ఇజ్రాయల్ దేశంలో కలిపే అవకాశం ఉంది. ఉగ్రవాదులను ఎరివేసి పూర్తిస్థాయిలో నియంత్రణలోకి తీసుకురావాలనే కృతనిశ్చయంతో ఇజ్రాయల్ ప్రభుత్వం ఉంది. వెస్ట్ బ్యాంకులో ఎలాంటి అలజడి చెలరేగినా ఆ ప్రాంతం కూడా అధీనంలోకి తీసుకుంటారు.
హమాస్ దాడుల మొదటి రోజు నుంచి ఇజ్రాయల్ ప్రధానమంత్రి బెంజిమేన్ నేతన్యాహు, రక్షణమంత్రి యోవ్ గల్లంట్, ఆర్మీచీఫ్ రావ్ అలుఫ్ ప్రకటనల అంతరార్థం ఇదేనని అంతర్జాతీయ రాజకీయాల విశ్లేషకులు అంటున్నారు. అదే నిజమైతే ఈప్రాంత భౌగోళిక స్వరూపం మారనుంది. ఇందుకోసం అవసరమైతే గాజాలోని పాలస్తీనియన్ ప్రజలను వెస్ట్ బ్యాంకుకు తరలించనున్నారు.
-దేశవేని భాస్కర్