తన వ్యక్తిగత భద్రతతో పాటు కుటుంబ సభ్యులకూ ప్రమాదం పొంచి ఉందని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జికి ఆయన ఓ లేఖ రాశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ ఖైదీగా బాబు ఉన్నారు. జైలు అధికారుల ద్వారా అక్టోబర్ 25న ఈ లేఖను ఏసీబీ జడ్జికి పంపారు. తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు, ఆందోళన వ్యక్తం చేస్తూ మూడు పేజీల లేఖను బాబు రాశారు.
చంద్రబాబు లేఖలో ముఖ్యాంశాలు:
- నాకు జెడ్ ప్లస్ సెక్యూర్టీ ఉంది. నేను జైల్లోకి వచ్చినప్పుడు అనధికారికంగా నన్ను వీడియోలు, ఫొటోలు తీశారు.
- ఆ ఫుటేజ్‌ను స్వయంగా పోలీసులే లీక్ చేశారు. నా రెప్యూటేషన్‌ను దెబ్బ తీసేందుకే ఈ తరహా వీడియో ఫుటేజ్ రిలీజ్ చేశారు.
- నన్ను అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నుతున్నారు.
- దీనికి సంబంధించిన లేఖను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి ఈ విషయమై లేఖ కూడా వచ్చింది.
- ఆ లేఖపై ఇప్పటి వరకు పోలీస్ అధికారులు ఎలాంటి విచారణ చేపట్టలేదు
- ఎస్ కోటకి చెందిన ఓ ముద్దాయి జైల్లో పెన్ కెమెరాతో విజువల్స్ తీస్తున్నారని నా దృష్టికి వచ్చింది.
- నా కదలికల కోసం జైలుపై అనధికారికంగా డ్రోన్లు ఎగరేస్తున్నారు.
- ప్రభుత్వంలో ఉన్న వాళ్లే ఈ డ్రోన్లు ఎగరేశారని భావిస్తున్నాను. డ్రోన్లు ఎగరేసిన ఘటనలోనూ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు.
- ఈ నెల 6న నన్ను కలవడానికి నా కుటుంబసభ్యులు వచ్చిన సందర్భంలో సెంట్రల్ జైలు మెయిన్ గేట్ వద్ద మరో డ్రోన్ ఎగరేశారు.
- నా భద్రతే కాదు. నా కుటుంబ సభ్యులకు ప్రమాదం పొంచి ఉందనే ఆందోళనతో ఉన్నా.
- నాలుగున్నరేళ్ల కాలంలో నాపై వివిధ సందర్భాల్లో అధికారంలో ఉన్న వాళ్లు దాడులు చేశారు.
- గంజాయి ప్యాకెట్లు జైలు ప్రాంగణంలో గార్డెనింగ్ చేస్తున్న ఖైదీల వద్దకు విసిరేస్తున్నారు.