-2.4 C
New York
Wednesday, November 29, 2023

Buy now

HomeTrending NewsPashtun: తాలిబన్ల కట్టడికి పాక్ కొత్త ఎత్తుగడ

Pashtun: తాలిబన్ల కట్టడికి పాక్ కొత్త ఎత్తుగడ

ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్ లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ను జైలులో వేసిన అధికార పక్షం నేతలు… జాతీయ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. వచ్చే ఏడాది జనవరిలో పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ తరుణంలో సామాజిక అశాంతికి దోహదం చేసేలా పాక్ తాత్కాలిక ప్రభుత్వం పూనుకుంది.

అక్రమ వలసదారులకు పాకిస్థాన్‌ వార్నింగ్‌ ఇచ్చింది. నవంబర్‌ 1లోగా దేశం నుంచి స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని గురువారం అల్టిమేటమ్‌ జారీ చేసింది. లేనిపక్షంలో వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అలాగే అక్రమ వలసదారులకు షెల్టర్‌ ఇచ్చిన వారిని చట్టపరంగా శిక్షిస్తామని పేర్కొంది.

పాకిస్థాన్‌లోని వేలాది మంది ఆఫ్ఘన్ జాతీయులతో సహా అక్రమంగా దేశంలో ఉంటున్న వలసదారులంతా నవంబర్ 1 గడువు కంటే ముందే స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని తాత్కాలిక అంతర్గత మంత్రి సర్ఫరాజ్ బుగ్తీ తెలిపారు. ఈ ఏడాది పాకిస్థాన్‌లో 24 ఆత్మాహుతి బాంబు దాడులు జరిగాయి. ప్రభుత్వం, సైన్యానికి వ్యతిరేకంగా జరిగిన 14 దాడులు, పలు నేరాలు, స్మగ్లింగ్‌ కార్యకలాపాల్లో ఆఫ్ఘన్ జాతీయుల ప్రమేయం ఉన్నట్లు పాకిస్థాన్‌ అధికారులు గుర్తించారు.

ప్రభుత్వం అనుమానాలు నిజమే అయినా వలసదారులను తిరిగి పంపటం సులువైన పని కాదు. పాకిస్థాన్ కు వలస వచ్చిన వారు ఆఫ్ఘన్ ప్రజలు కాగా వారంతా ఖైభర్ పఖ్తుంఖ్వ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ పష్తున్ (పఠాన్) వర్గం ప్రాబల్యం ఎక్కువ. ముస్లీములే అయినా వీరు పష్తో బాష మాట్లాడుతారు. వలస వచ్చిన వారు కూడా పఠాన్ వర్గం వారే. పాక్-ఆఫ్ఘన్ దేశాల్లోని పష్తున్ ల మధ్య బంధుత్వాలు ఉన్నాయి.

ఆఫ్ఘనిస్తాన్ ఏలుబడిలో ఉన్న తాలిబాన్ నేతల్లో ఎక్కువగా పష్తున్ జాతీయులే కాగా వారందరికీ ఖైభర్ పఖ్తుంఖ్వ రాష్ట్రంతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ప్రముఖ హక్కుల కార్యకర్త మాలాల యూసుఫ్ జాయ్ ఈ ప్రాంతానికి చెందినవారే కావటం గమనార్హం. ఈ రాష్ట్రంలోనే తెహ్రీక్ ఏ తాలిబాన్ (TTP) బలంగా ఉంది. టిటిపి పాక్ ప్రభుత్వానికి సవాలు విసురుతోంది.

పాక్ ఏర్పడిన తర్వాత ప్రధానులు అందరు పంజాబ్, సింద్ రాష్ట్రం వారే. ఇమ్రాన్ ఖాన్ మాత్రం పెషావర్ కు చెందిన నేత. అధికార యంత్రాంగం, రాజకీయ అధికారం పంజాబ్ రాష్ట్రం నుంచే కావటంతో ఆ రాష్ట్రానికి నిధులు వరదలా వచ్చాయి. ఖైభర్ పఖ్తుంఖ్వ రాష్ట్రం మొదటి నుంచి వెనుకబడిన ప్రాంతంగానే ఉంది.

నిధుల పంపిణీలో అన్యాయం జరుగుతోందని మొదలైన ఆందోళనలు…ఇప్పుడు దేశ ప్రభుత్వాన్ని సవాలు చేసే స్థాయికి చేరుకున్నాయి. ఈ రాష్ట్రంలో గ్రామాల నుంచి పట్టణాల వరకు నిరుద్యోగం అధికం. ఉద్యోగాల కోసం… వాంటెడ్ జిహాది అనే పేరుతో పోస్టర్లు విరివిగా కనిపిస్తాయి.

ఉపాధి లేకపోవటంతో నిరుద్యోగ యువత తాలిబాన్, జైష్ ఏ మహమ్మద్ తదితర ఉగ్ర సంస్థల్లో చేరుతున్నారు. వీటిల్లో చేరేందుకు ఒప్పందం ప్రకారం యువత కుటుంబ సభ్యులకు ముందే చెల్లింపులు జరుగుతాయి. ఎక్కడ ఏం జరిగినా ఉగ్ర ఆనవాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండటం సహజం.

పాక్ ఆక్రమిత్ కాశ్మీర్, భారత్, ఆఫ్ఘన్ దేశాల్లో చనిపోయిన వారి వార్తలు రాగానే ఇక్కడి కుటుంబాల్లో ఆందోళన మొదలవుతుంది. తమ వారు చనిపోయారా అని ఆరా తీయటం నిత్యకృత్యం. ఇంత జరుగుతుంటే పాకిస్తాన్ ప్రభుత్వాలు ఏ రోజు వీరిని పట్టించుకున్న దాఖలా లేదు.

ఆఫ్ఘన్ లో తాలిబాన్ అధికారంలోకి వచ్చాక వేల కుటుంబాలు పాక్ వచ్చాయి. వారందరినీ ఆహ్వానించిన పాకిస్థాన్ ప్రభుత్వం శరణార్థి శిభిరాల్లో కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదు. విద్యుత్, తాగునీరు కొరత…అన్న పానీయాలు లేక కడుపు నింపుకునేందుకు హత్యలు, నేరాల వైపు మొగ్గు చూపుతున్నారు.

ఆత్మాభిమానం, ధైర్య సాహసాలకు మారు పేరైన పష్తున్ జాతీయులు అణచివేత సహించరు. నవంబర్ ఒకటి తర్వాత అక్రమవలసదారుల పేరుతో ప్రభుత్వం వీరిని కట్టడి చేయాలని చూస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది. వలసదారులను బలవంతంగా వెళ్లగొట్టే రోజు వస్తే దేశంలో అంతర్గత యుద్ధం జరిగినా ఆశ్చర్యపోనక్కర లేదు.

పరోక్షంగా తాలిబన్లను దారిలోకి తీసుకురావటానికి పాకిస్థాన్ తాత్కాలిక ప్రభుత్వం వేస్తున్న ప్రణాళిక వికటిస్తే దేశమంతా అగ్గి రాజుకుంటుంది.పష్తున్ వలసదారులకు… బలూచ్ తిరుగుబాటుదారులు తోడైతే హింస తారాస్థాయికి చేరుతుంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్