Saturday, November 23, 2024
HomeTrending NewsDandora: మాదిగలకు అండగా ప్రధాని మోడీ

Dandora: మాదిగలకు అండగా ప్రధాని మోడీ

మాదిగ దండోరా మూడు దశాబ్దాల కల నెరవేరే రోజు ఆసన్నమైంది. SC వర్గీకరణ పోరాటానికి త్వరలోనే ముగింపు పలుకుతానని ప్రధానమంత్రి నరేంద్రమోడి భరోసా ఇచ్చారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఈ రోజు జరిగిన మాదిగ దండోరా విశ్వరూప మహాసభ పేరుకు తగ్గట్టుగానే సాగింది.

సభ ప్రారంభం కాగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడికి స్వాగతం పలికిన మంద కృష్ణ మాదిగ బావోద్వేగానికి లోను కాగా ప్రధాని ఓదార్చారు. మందకృష్ణ ప్రసంగం యావత్తు ప్రధాని సాహసోపేతమైన నిర్ణయాల్ని ప్రస్తావిస్తూ సాగింది. పెద్దన్న మోడీ అని పదే పదే సంబోదించిన మంద కృష్ణ… కెసిఆర్, కాంగ్రెస్ పార్టీలు మాదిగలకు అన్యాయం చేశారని ఎండగట్టారు. మాదిగలకు న్యాయం చేస్తే దక్షిణ భారతదేశంలోని ఈ వర్గం ప్రజలు బిజెపికి అండగా ఉంటారని చెప్పారు.

అన్ని రాజకీయ పార్టీలతో SC వర్గీకరణకు మద్దతు సమీకరించిన మంద కృష్ణ మాదిగ…ప్రధాని నరేంద్ర మోడి అనుకూలంగా ప్రకటన చేయటం… దశాబ్దాల పోరాటం చివరి అంకానికి చేరిందన్నట్టుగా కనిపిస్తోంది.

మాదిగల సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే కమిటీ వేస్తామని ప్రధాని ప్రకటించారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటి నుంచి మాదిగల పోరాటంలో మందకృష్ణకు సహాయకారిగా పనిచేస్తానని ప్రధాని అనగానే సభలో హర్షద్వానాలు వెల్లువెత్తాయి.

మొన్నటి బీసీల సభతో పోలిస్తే మాదిగల సభ విజయవంతం అయిందనే చెప్పాలి. ఈ రోజు (శనివారం) జరిగిన సభ తెలంగాణ ఎన్నికల సరళిని మార్చే దిశగా సాగిందని చెప్పుకోవచ్చు. మాదిగల ముప్పై ఏళ్ళ పోరాటం ప్రస్తావించినపుడు ప్రధాని ఆవేశానికి లోనయ్యారు. గుర్రం జాషువా దళితుల కష్టాలు కాశీ విశ్వనాథునికి మొరపెట్టుకున్నాడని…వారణాసి ఎంపిగా ఉన్న తనను ఆ విశ్వనాథుడే మీ వద్దకు పంపాడని ప్రధాని అన్నారు.

ప్రధాని ప్రకటనతో మాదిగల్లో అంతర్మధనం మొదలైంది. కాంగ్రెస్ మొదటి నుంచి మాలలకు అండగా ఉంది. టిడిపి లేకపోవటంతో మాదిగలకు రాజకీయ అండ కరువైంది. ఇక ఇప్పటి నుంచి మాదిగలు కాషాయ దళంతో కలిసి పనిచేసే రోజు వచ్చింది. దండోరాలో కొంత శాతం క్రైస్తవం అనుసరిస్తున్నారు. వాళ్ళ వైఖరి ఎలా ఉండబోతోందో ఆసక్తికరంగా మారింది.

BSP రాష్ట్ర అధ్యక్షుడు RS ప్రవీణ్ కుమార్ మాదిగ సామాజిక వర్గం నేత. స్వేరో నిర్మాణంలో మాదిగల ప్రాతినిధ్యమే ఎక్కువగా ఉంది. వీళ్ళందరు నీలి రంగు జెండాతో ఏనుగుపై సవారీ చేస్తున్నారు. ప్రధాని ప్రకటన వీరిని ఎంతవరకు ప్రభావం చేయనుందో చూడాలి.

వచ్చే సార్వత్రిక ఎన్నికలలోపే SC వర్గీకరణ కార్యరూపం దాల్చనుందని విశ్వసనీయ సమాచారం. కమిటీ ఏర్పాటు లాంచనమేనని.. న్యాయపరమైన అడ్డంకులు తొలగించి… పార్లమెంటులో బిల్లు ఆమోదానికి ప్రధాని కార్యాలయం ఇప్పటికే  కసరత్తు ప్రారంభించిందని తెలిసింది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్