బెంగళూరు మహానగరంలో గడిచిన కొద్ది రోజుల్లో చిన్న పిల్లల్లో భారీ ఎత్తున కరోనా కేసులు బయటపడటంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. 6 రోజుల వ్యవధిలో 300 మందికి పైగా పిల్లలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. ఆగస్టు 5 నుంచి 10వ తేదీ మధ్యలో 127 మంది పదేళ్ల లోపు పిల్లలకు కరోనా పాజిటివ్‌గా తేలగా, మరో 174 మంది 10 నుంచి 19 ఏళ్ల వయసు మధ్య పిల్లలు మహమ్మారి బారిన పడ్డారు….
పిల్లల్లో ప్రమాదకర స్థాయిలో కరోనా కేసులు బయటపడుతుండటంతో బృహత్ బెంగళూరు మహానగర పాలిక, కర్ణాటక వైద్య ఆరోగ్యశాఖలు అప్రమత్తమై కరోనా కట్టడికి చర్యలు చేపడుతున్నాయి. మహమ్మారిని కట్టడి చేసేందుకు బెంగళూరు నగరంలో 144 సెక్షన్ ను విధించారు. పిల్లలకు కరోనా టీకాలు ఇవ్వడంపై ఇంకా స్పష్టత లేని సమయంలో కరోనా కేసులు భారీ స్థాయిలో వెలుగుచూస్తుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు….
ఇదిలా ఉంటే, భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ సమయంలో పిల్లలు కూడా వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో పిల్లల్లో కొవిడ్ కేసుల సంఖ్య మూడు రెట్లు పెరిగే ప్రమాదముందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల్ని ఇళ్లలో నుంచి బయటికి రాకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని సూచిస్తున్నారు