తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో ఇక అనాధలు ఉండరని, వారందర్నీ రాష్ట్ర బిడ్డలుగా చిల్డ్రన్ ఆఫ్ ద స్టేట్ గా పరిగణిస్తూ వారి సంరక్షణ బాధ్యతలు చేపట్టి ప్రభుత్వమే అన్ని తానై తీసుకుంటుందని గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. కుటుంబానికి దూరమై అనేక ఇబ్బందులతో హోమ్స్ లలో చేరిన బాల బాలికల కోసం హైదరాబాద్ లోని సైదాబాద్, నిమ్బోలిఅడ్డ ప్రాంతాలలో 7.65 కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాలను మంత్రులు శ్రీమతి సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశం కలిసి ప్రారంభించారు.
సీఎం కేసిఆర్ ఆశీర్వాదంతో 3.6 కోట్ల రూపాయలతో బాలికల కోసం నిర్మించుకున్న హోమ్ నూతన భవనాన్ని ప్రారంభించుకోవడం సంతోషకరమన్నారు. ఈ రాష్ట్రంలో ఉండే అనాథలు ఇకపై ఈ రాష్ట్ర బిడ్డలు( చిల్డ్రన్ ఆఫ్ దిస్టేట్) గా పరిగణింప బడుతారు. ఇకపై వారిని అనాథలు అనరు. కుటుంబం కంటే ఎక్కువ ప్రేమ పంచి భవిష్యత్ కు బంగారు బాట వేసే విధంగా హోమ్స్ పని చేస్తున్నాయని మంత్రి తెలిపారు.
మంత్రి వర్గ ఉపసంఘం కొద్ది రోజుల్లో ఈ రాష్ట్ర బిడ్డల బంగారు భవిష్యత్ కోసం తన నివేదిక ఇస్తుందని, సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి ఈ హోమ్స్ లో సన్న బియ్యం పెడతామని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి శ్రీమతి దివ్య దేవరాజన్, బాల నేరస్తుల శాఖ డైరెక్టర్ శ్రీమతి శైలజ, స్థానిక కార్పొరేటర్లు కొత్తకాపు అరుణ, దూసరి లావణ్య, ఇతర అధికారులు నేతలు పాల్గొన్నారు.