Monday, November 25, 2024
HomeTrending Newsవిశేష ప్రేక్షకాదరణతో సాగుతోన్న 'నంది' ప్రదర్శనలు

విశేష ప్రేక్షకాదరణతో సాగుతోన్న ‘నంది’ ప్రదర్శనలు

గుంటూరులో జరుగుతున్న నంది నాటకోత్సవాలకు విశేషమైన ప్రేక్షకాదరణ లభిస్తోంది. ప్రాంగణం లోపల ఎంతమంది ప్రేక్షకులు ఉంటున్నారో వెలుపల ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ల వద్ద కూడా అంతే మంది కూర్చుని వీక్షిస్తున్నారు.  నేడు ఐదో రోజు బుధవారంనాటి ప్రదరనలు సమాజానికి ఆదర్శం పంచిన మహనీయుల జీవిత కథనాలతో, చూపరులను ఆకట్టుకోగల రంగస్థల సాంకేతితను సద్వినియోగం చేసుకుంటూ ప్రదర్శితమయ్యాయి. తొలి ప్రదర్శనే ఆదర్శమూర్తి జీవిత ఆవిష్కరణతో ప్రారంభమైంది.

  1. శ్రీకాంత కృష్ణమాచార్యులు:

శ్రీకాంత కృష్ణమాచార్యులు లేదా కృష్ణయ్య లేదా సింహగిరి కృష్ణమాచార్యులు ఒక ఆదర్శ యోగి. 13, 14 శతాబ్ధాలకు చెందినవారు. మొదటి తెలుగు వచన వాజ్ఞయా చార్యుడిగా మంచి గుర్తింపు పొందిన వ్యక్తి. ప్రథమాంధ్రవచన నిర్మాతగా పేరొందినవాడు. ఆయన జీవిత చరిత్ర ఎంతో ఆదర్శవంతం. స్ఫూర్తిదాయకం. సింహాచలంలో వెలసిన
శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి పరమభక్తుడు. అన్నమయ్య లాంటి సంకీర్తనాచార్యులకు, పోతన వంటి భాగవతోత్తములకు స్ఫూర్తినిచ్చిన వాగ్గేయకారుడు, వారికంటే ప్రాచీనుడు. ఆయన జీవితాన్నే నాటకంగా మలచారు రచయిత మిరియాల లక్ష్మీపతి. కె. వెంకటేశ్వర రావు దర్శకత్వం వహించారు.

  1. ప్రపంచతంత్రం:

రెండో ప్రదర్శనగా బాలల నాటిక ప్రపంచతంత్రం ప్రదర్శితమైంది. దీన్ని న్యూస్టార్ మోడరన్ థియేటర్ ఆర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విజయవాడ వారు ప్రదర్శించారు. విన్నకోట రాజేశ్వరి రచనకు డాక్టర్ ఎంఎస్ చౌదరి దర్శకత్వం వహించారు. పంచతంత్ర కథలను విష్ణుశర్మ ఆనాడు యువరాజులకు జీవన విధానాన్ని బోధించటానికి చిన్నచిన్న కథలుగా రాశాడు. అవన్నీ ఈ నాటికీ ఎంతో ఉపయుక్తాలేననీ, ప్రపంచాన్ని అర్ధం చేసుకోవటానికి, జీవన గమ్యాలు చేరడానికి బాగా ఉపకరిస్తాయని  చెప్పిందీ నాటిక. ఎంతో ఆసక్తికరంగా దర్శకత్వ మెలకువలను ప్రదర్శిస్తూ ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాలల నటన, వాచకం తదితరాలు బాగున్నాయి.

  1. విజ్ఞాన భారతం సాంఘిక నాటకం:

డాక్టర్ రామన్ ఫౌండేషన్, సాయిబాబా నాట్యమండలి విజయవాడ వారి ప్రదర్శన ఇది. ప్రపంచానికి ఆధ్యాత్మిక గురువు భారతదేశం. భారత భాగవత, రామాయాణాలు మన జాతి చరిత్రల మూలాధారాలు మన దేశంలో అసలు దేవుని ఉనికినే ప్రశ్నించే భౌతిక వాదులు తయారై మన చరిత్రను పక్కనపెట్టి విఙ్ఞానాన్ని పుక్కిటి పురాణాలుగా కొట్టి పారేస్తున్నారనే విషయాన్ని ఎంతో సూటిగా, చూపరులకు భారత జాతి ఔన్నత్యాన్ని తెలియజేసేదిగా ఈ నాటకం వుంది. నాటి విజ్ఞానాన్ని నేటి తరానికి తెలియజేసి నాటి చారిత్రక సత్యాలను శాస్త్రీయంగా నిరూపించడమనే లక్ష్యాన్ని ఈ నాటకం చేరుకోగలిగింది. రచన, దర్శకత్వం డాక్టర్ పీవీఎన్ కృష్ణ.

4. అతీతం (నాటిక)

అభినయ ఆర్ట్స్ గుంటూరు వారు ప్రదర్శించిన నాటిక ఇది. శ్రీ రామచంద్రమౌళి కథకు నాటకీకరణను శిష్ట్లా చంద్రశేఖర్ దర్శకత్వాన్ని ఎస్. రవీంద్రరెడ్డి సమర్ధవంతంగా అందించారు. వింత జబ్బులా తయారైన ప్రంచీకరణను, దాని ఫలితాలను విశ్లేషించిదీ నాటిక. దగాపూరిత ప్రపంచీకరణ భూతానికి ఎదురుతిరిగి ఈ తరం యువతరం అసలైన ప్రపంచీకరణకు అర్ధం చెప్పి ఈ దేశాన్ని, సమాజాన్ని, చిధ్రమైపోతున్న మన భారతీయ కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలని సందేశమిచ్చిన నాటిక ఇది.

  1. కపిరాజు

అన్నదమ్ముల ఆదర్శ గుణాలను చూపించిన ఈ నాటికను న్యూస్టార్ మోడరన్ థియేటర్ ఆర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు వారు ప్రదర్శించారు. డాక్టర్ ఎంఎస్ చౌదరి రచనకు పి. దివాకర్ ఫణీంద్ర దర్శకత్వం వహించారు. రామాయణ మహాభారత కథల్లో అన్నదమ్ముల కథలే ప్రసిద్ధాలు. రామాయణలో రామ లక్ష్మణులు; రావణ విభీషణులు; వాలి సుగ్రీవులు కనిపిస్తారు. రావణ విభీషణ మధ్య అహంకారం…వాలి సుగ్రీవుల మధ్య అధికారం చిచ్చు పెట్టింది. కానీ ధర్మం అహంకారాన్ని, అధికారాన్ని వదిలి పెట్టిన రామలక్ష్మణులను భగవంతులుగా నిలబెట్టిందనీ, అహంకారం, అపార్థం ఎంతటి పతనానికైనా దారితీస్తాయని తెలియజేసింది ఈ నాటిక.

  1. కొత్తపరిమళం నాటిక:

అది ఇండియా – పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం…. మూడో ప్రపంచ యుద్ధ భయంతో ప్రజలు క్షణ క్షణం వణుకుతూ, నరక యాతన పడుతూ, బతుకీడుస్తున్న కాలం….ఒక ప్రక్క మంచు కొండలా పేరుకుపోతుంది. మరోపక్క మనుషుల్లో మానవత్వం మంటగటసిపోయి, జాతి, మత ద్వేషాలుతో దేశాలు రగిలిపోతున్నాయి. వాటి మధ్య నలిగిపోయిన సరిహద్దు జీవిత గాథే ఈ కొత్త పరిమళం నాటిక. ప్రపంచంలో మనుషులందరూ మంచివాళ్లే. కానీ కాలమాన పరిస్థితులే మంచివి కావు. మనుషుల్లో శత్రుత్వాల్ని, విద్వేషాల్ని రగిలిస్తూ పెంచి పోషిస్తాయి. ద్వేషం-మనిషికైనా, దేశానికైనా, ఎంత  మాత్రమూ మంచిచేయదు. చివరికి అనర్థమే మిగులుతుంది. కనుక…జాతి, మత, ద్వేషాన్ని అంతం చేసే మానవత్వపు, విశ్వరూప, సౌందర్యం అనే కొత్త పరిమళంతో హద్దులు, సరిహద్దులు లేని అందమైన ప్రపంచాన్ని భావితరాలకు అందాలనే లక్ష్యంతో ప్రదర్శితమైంది ఈనాటిక. కాండ్రేగుల శ్రీనివాసరావు మూల కథా రచనకు కె. కె. యల్. స్వామి నాటకీకరణను, బీఎంఎస్ పట్నాయక్  దర్శకత్వాన్ని సమకూర్చారు

  1. రాతిలో తేమ నాటిక:

పిన్నమనేని మృత్యుంజయరావు రచనకు ఆర్. వాసుదేవ రావు దర్శకత్వం వహించిన నాటిక ఇది. కఠిన హృదయం కరిగినపుడు కిరాతకుడు వాల్మీకిగా మారాడు. రక్తాన్ని పారించిన అశోకుడు ఒక చిన్న సంఘటనతో కారుణ్యమూర్తిగా మారాడు. మంచికి చెడ్డకి సరిహద్దు రేఖ చాలా చిన్నది. ప్రేమతో తిట్టినపుడు రాతి గుండెలోను ఆర్ద్రత కలుగుతుంది. రాతిలోను తేమ ఉంటుంది. మానవత్యాసానికి, దానవత్వానికి మధ్య జరిగిన సంఘర్షణ ఇలా  రాతిలో తేమ నాటికగా మారి మంచి సందేశమిచ్చింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్