Friday, September 20, 2024
HomeTrending Newsఇండియా కూటమికి నితీష్ కుమార్ షాక్

ఇండియా కూటమికి నితీష్ కుమార్ షాక్

బీజేపీని గద్దెదించడమే లక్ష్యంగా ఏర్పాటైన ఇండియా కూటమి పరిస్థితి మూన్నాళ్ల ముచ్చటలా మారింది. కూటమిలోని కీలక నేతలు బయటకు వస్తున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ సైతం ఇండియా కూటమిని వీడేందుకు సిద్ధమైనట్లు, త్వరలోనే ఎన్డీఏ కూటమిలో చేరాలని నితీశ్‌ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమిని ఏర్పాటుచేయడంలో కీలకంగా వ్యవహరించిన నితీష్ కుమార్ మళ్లీ బీజేపీ వైపు మొగ్గుతున్నట్టు సమాచారం. ఇండియా కూటమిలోని ఆర్జేడీతో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో నితీశ్‌ తిరిగి ఎన్డీఏతో చేతులు కలిపేందుకు పావులు కదుపుతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. నితీష్ నిర్ణయం కూటమికి శరాఘాతంగా మారింది.

పంజాబ్‌లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ, బెంగాల్‌లో అధీర్ రంజన్ చౌదరి తృణమూల్‌పై నిరంతర విమర్శలు సైతం కూటమికి బీటలు పడేలా చేస్తున్నాయి. ఆ రెండు పార్టీలను అసంతృప్తికి గురిచేశాయని, అందుకే ఒంటరిపోరుకు సిద్ధమైనట్లు ప్రకటించాయి. పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని మమతా బెనర్జీ ప్రకటించారు. పంజాబ్‌లోని మొత్తం 13 లోక్‌సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ తేల్చి చెప్పింది.

బెంగాల్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఎదురుదెబ్బలు తిన్న ఇండియా కూటమికి బీహార్‌లో నితీష్ కుమార్ వైఖరిలో వచ్చిన ఆకస్మిక మార్పు సవాళ్లు విసురుతోంది. బీహార్‌లో నితీష్ కుమార్ తదుపరి చర్య.. ఆ రాష్ట్ర భవిష్యత్తుతో పాటు ఇండియా కూటమి మనుగడపై ప్రభావం చూపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

జేడీయూ, లాలూ సార‌ధ్యంలోని ఆర్జేడీ మ‌ధ్య విభేదాలు తీవ్ర‌మైన క్ర‌మంలో బీహార్‌లో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. అయోధ్య‌లో రామాల‌య నిర్మాణం, బీజేపీ సార‌ధ్యంలోని కేంద్ర ప్ర‌భుత్వం… సోష‌లిస్ట్ దిగ్గ‌జం, బిహార్ మాజీ సీఎం క‌ర్పూరీ ఠాకూర్‌కు భార‌త ర‌త్న ప్ర‌క‌టించ‌డం వంటి ప‌రిణామాలు రాజ‌కీయ స్వ‌రూపాన్ని మార్చేశాయి.

తాజా పరిణామాలపై SP అధినేత అఖిలేష్ యాదవ్ పార్టీ నేతలతో సమాలోచనలు చేస్తున్నారు. నితీష్ కుమార్ ఇండియా కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అఖిలేష్ అన్నారు. ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ అధిక సీట్లు ఆశిస్తే సమాజ్ వాది పార్టీ కూడా కూటమికి గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయి.

రాష్ట్రాల స్థాయిలో కాంగ్రెస్ నేతల వైఖరితోనే కూటమిలో కలహాలు ఏర్పడ్డాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పశ్చిమ బెంగాల్లో బలం లేకున్నా కాంగ్రెస్ అధిక సీట్లు ఆశించటం, పంజాబ్ లో ఆప్ సమ ఉజ్జీగా ఉన్నా కొన్ని స్థానాలే ఇవ్వచూపటం విభేదాలకు దారితీసింది.

ఇండియా కూట‌మిలో విభేదాలు, ప్ర‌ధాని అభ్య‌ర్ధిపై స్ప‌ష్ట‌త క‌రువ‌వ‌డం కూడా నితీష్ కుమార్‌లో అసంతృప్తికి కార‌ణ‌మ‌య్యాయని చెబుతున్నారు. ఈ ప‌రిణామాల‌న్నీ నితీష్‌ను తిరిగి బీజేపీ సార‌ధ్యంలోని ఎన్డీయే కూట‌మి దిశ‌గా ప‌య‌నించేలా చేస్తున్నాయ‌ని ప‌రిశీల‌కులు విశ్లేషిస్తున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్