రాజ్ కోట్ లో ఇండియా తో జరుగుతోన్న మూడో టెస్ట్ లో ఇంగ్లాండ్ కూడా ధీటుగా జవాబిస్తోంది. ఓపెనర్ బెన్ డక్కెట్ సెంచరీతో సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు కోల్పోయి 326 పరుగులతో నేటి రెండో రోజు ఆటను ఇండియా మొదలు పెట్టింది. 110 పరుగులతో క్రీజులో ఉన్న జడేజా మరో రెండు పరుగులే జోడించి ఔటయ్యాడు. కుల్దీప్ యాదవ్ కేవలం నాలుగు పరుగులే చేశాడు. కాగా ధృవ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్ లు ఏడో వికెట్ కు 77 పరుగులు జోడించారు. అశ్విన్-37; జురెల్-46 పరుగులు చేయగా బుమ్రా 26 రన్స్ చేసి చివరి వికెట్ గా ఔటయ్యాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 4; రెహాన్ అహ్మద్ 2; అండర్సన్, రూట్, టామ్ హార్ట్ లీ తలా ఒక వికెట్ సాధించారు.
ఆ తర్వాత బ్యాటింగ్ మొదలు పెట్టిన ఇంగ్లాండ్ తొలి వికెట్ కు 89 పరుగులు చేసింది. జాక్ క్రాలే 15 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్ లో అవుట్ కాగా… ఈ వికెట్ తో అశ్విన్ టెస్ట్ క్రికెట్ లో 500 వికెట్ల మైలురాయి చేరుకున్నాడు. ఓలీ పోప్ 39 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసి ఇంకా 238 పరుగులు వెనుకబడి ఉంది. డక్కెట్-133; జో రూట్-9 పరుగులో క్రీజులో ఉన్నారు. అశ్విన్, సిరాజ్ చెరో వికెట్ సాధించారు.