Monday, November 25, 2024
HomeTrending Newsకాంగ్రెస్ ఎంపి అభ్యర్థుల జాబితా

కాంగ్రెస్ ఎంపి అభ్యర్థుల జాబితా

జాతీయ స్థాయిలో రెండు సార్లు వరుస ఓటముల్ని చవిచూసిన కాంగ్రెస్ 2024 లోక్ సభ ఎన్నికలకోసం జాగ్రత్తగా కసరత్తు చేస్తోంది. శుక్రవారం 39 మందితో కూడిన ఎంపి అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఈ మేరకు పార్టీ ప్రధానకారదర్శి కేసి వేణుగోపాల్ వివరాలు వెల్లడించారు.

రాహుల్ గాంధి మరోసారి వయనాడ్ నుంచి బరిలో దిగుతున్నారు. కేసి వేణుగోపాల్ అలపుజా, శశి థరూర్త తిరువంతపురం నుంచి పోటీ చేయబోతున్నారు. 39 మంది అభ్యర్థుల్లో 15 మంది ఓసి వర్గానికి చెందినవారు. 24 మంది ఇతర వర్గాలకు చెందినవారు ఉన్నారు.  మొదటి జాబితాలో ముగ్గురు మహిళలకు అవకాశం దక్కింది.

ఈ జాబితాలో చత్తీస్ ఘడ్ -6 స్థానాలు, కర్నాటక-7, కేరళ- 16, తెలంగాణ-4 లక్ష్యద్వీప్-1, మేఘాలయ-2, నాగాలాండ్-1, సిక్కిం-1, త్రిపుర-1 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.

తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాలకు గాను నలుగురు అభ్యర్థులను ప్రకటించారు. నల్గొండ నుంచి మాజీమంత్రి జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఇప్పటికే ఒక కుమారుడు జైవీర్ రెడ్డి నాగార్జునసాగర్ నుంచి ఎమ్మెల్యేగా ఉండగా మరొకరికి ఎంపిగా చాన్స్ దక్కింది.

మహబూబాబాద్ స్థానం నుంచి కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్ పోటీ చేయనున్నారు. ఈ స్థానం నుంచి అనేకమంది పేర్లు వినిపించినా అధిష్ఠానం పార్టీ విదేయునికే పట్టం కట్టింది. మంత్రి పొంగులేట్ సహకారంతో విజయభాయి పేరు ప్రముఖంగా వినిపించింది.

మహబూబ్ నగర్ నుంచి అందరు అనుకున్నట్టుగానే చల్లా వంశీచంద్ రెడ్డి పేరు ఖరారు చేశారు. వంశీచంద్ రెడ్డి పేరు ఇప్పటికే రేవంత్ ప్రకటించారు. శాసనసభ ఎన్నికల నాటి నుంచే వంశీచంద్ పాలమూరు కేంద్రంగా పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

జహిరాబాద్ నుంచి మాజీ ఎంపి సురీష్ షేట్కర్ పేరు ఖరారు అయింది. శాసనసభ ఎన్నికల్లో నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యేగా సురేష్ పేరు ప్రకటించినా.. చివరకు సంజీవరెడ్డికి టికెట్ దక్కింది. పార్టీ ఆదేశానుసారం పోటీ నుంచి తప్పుకుని సంజీవరెడ్డి గెలుపునకు సురేష్ షేట్కర్ సహకరించారు.

మిగతా సీట్లపై ఏకాభిప్రాయం రావాల్సి ఉంది. మల్కాజ్ గిరి నుంచి అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డిని పోటీకి దించే అవకాశం ఉంది. చేవెళ్ల సీటును ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన వికారాబాద్ జెడ్పీ ఛైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి, సికింద్రాబాద్ నుంచి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భార్య బొంతు శ్రీదేవిని బరిలోకి దింపాలని చర్చ జరుగుతోంది.

నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. మెదక్ నుంచి నీలం మధు, కరీంనగర్ ఎంపీ స్థానానికి ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ పేర్లు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ స్థానం నుంచి మస్కటీతో పాటు మరో ఇద్దరు మహిళా నేతల పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

వరంగల్ స్థానానికి దొమ్మాట సాంబయ్య పేరు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. నాగర్ కర్నూల్ సీటు తనకే ఇస్తారన్న ధీమాలో మల్లురవి ఉన్నారు. అయితే, అదే స్థానం కోసం మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా ఎదురుచూస్తున్నారు. పెద్దపల్లి నుంచి వివేక్ తనయుడు వంశీతో పాటు మాజీ ఎంపీ సుగుణకుమారి, స్థానిక నేత శ్యామ్ పేర్లు వినిపిస్తున్నాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్