తెలుగు .. తమిళ భాషల్లో అనుష్కకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ‘సైజ్ జీరో’ తరువాత అనుష్క సినిమాల సంఖ్యను తగ్గించిన విషయం తెలిసిందే. ‘భాగమతి’ తరువాత ఆమె సినిమాలు పెద్దగా ఆడలేదనే చెప్పాలి. ప్రస్తుతం ఆమె క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓ మలయాళ సినిమా చేయడానికి అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది .. ఆ సినిమా పేరే ‘కథనార్ – ది వైల్డ్ సోర్సెరర్’. 18 ఏళ్ల తన కెరియర్లో అనుష్క ఒప్పుకున్న మొదటి మలయాళ సినిమా ఇదే.
అనుష్క అభిమానులంతా అంతగా ఈ సినిమాలో ఏవుంది? అనే అనుకున్నారు. కానీ చూస్తుంటే ఈ సినిమా అనేక ప్రత్యేకతలు కలిగినదిగానే కనిపిస్తోంది. ఈ సినిమాలో అనుష్క నెగెటివ్ రోల్ చేయనుందనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్న మొదటి అంశంగా చెప్పుకోవచ్చు. ఇంతవరకూ అనుష్క ఇలాంటి పాత్రను చేయలేదు. పైగా ఇది హారర్ జోనర్ .. ఇంతవరకూ ఈ స్థాయిలో భయపెట్టే సినిమాలోను ఆమె చేయలేదని అంటున్నారు. మొదటి నుంచి చివరి వరకూ ఈ కథ ఉత్కంఠ భరితంగా నడుస్తుందని అంటున్నారు.
ఇక ఈ సినిమాను 14 భాషల్లో ఒకసారి విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. అంతేకాదు రెండు భాగాలుగా దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇంతవరకూ అనుష్క చేసిన సినిమాల్లో ‘అరుంధతి’కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ సినిమాకి దగ్గరగా ఈ సినిమా కాన్సెప్ట్ ఉంటుందని అనడంతో, ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. కేరళలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా అంటూ మేకర్స్ మరింత ఆసక్తిని పెంచారు. జయసూర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి, రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మొదటి భాగం, ఈ ఏడాది ద్వితీయార్థంలో థియేటర్లకు రానుంది.