చంద్రబాబుకు ఐదేళ్ళ క్రితం ఉగ్రవాదిగా కనిపించిన ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు విశ్వగురుగా కనిపించడం విచిత్రంగా ఉందని మాజీ మంత్రి పేర్నినాని విస్మయం వ్యక్తం చేశారు. ఈ సభలో మోడీపై చంద్రబాబు భజన మామూలుగా లేదని… ఈ మార్పుకు కారణమేమిటని నిలదీశారు. ఐదేళ్ళ క్రితం మోడీ గో బ్యాక్ అన్న బాబు ఇప్పుడు వంగి వంగి దండాలు పెడుతున్నారని విమర్శించారు. లుచ్చా, బచ్చా అని గతంలో తిట్టిన వారికి ఇప్పుడు అచ్చా ఎలా అయ్యారన్నారు. గతంలో పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని చెప్పిన పవన్ కు చిలకలూరిపేటలో అవి ఎలా తాజాగా మారాయని నాని ఫైర్ అయ్యారు. తమ కూటమికి ఎందుకు ఓటు వేయాలో ఎవరూ చెప్పలేకపోయారని ఎద్దేవా చేశారు. ఈ సభ ఐదో సిద్ధం సభగా పేర్ని అభివర్ణించారు. గత నాలుగు సిద్ధం సభల్లో తనకు ఎందుకు ఓటు వేయాలో జగన్ ప్రజలకు చెప్పారని… కానీ తమకు ఓటు వేస్తె ఏమి మేలు చేస్తారో చెప్పలేకపోయారని అన్నారు.
జగన్ కు ఓటు వేయవద్దని స్వయానా ఆయన చెల్లెలు చెప్పిందని బాబు అంటున్నారని… బాబు గురించి ఆయన తమ్ముడు, ఇప్పుడు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న ఆయన మరదలు, బావ మరిది హరికృష్ణ లు ఏమి చెప్పారో ఒక్కసారి ఆలోచించుకోవాలని సూచించారు. కనీసం సభ జరుపుకోవడం రాక, పదిహేను నిమిషాల పాటు మోడీని మైక్ లేకుండా ఖాళీగా నిల్చోబెట్టిన వారు జగన్ పై యుద్ధం ఎలా చేస్తారని వ్యాఖ్యానించారు.మూడు పార్టీల సభ వెలవెలబోయిందన్నారు.
ఏఐసిసి అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదని ఆల్ ఇండియా చంద్రబాబు కమిటీ అని దీనిలో రేవంత్ రెడ్డి, షర్మిల, రేణుకా చౌదరి, తులసిరెడ్డి లాంటి వాళ్ళు సభ్యులుగా ఉన్నారని నాని చమత్కరించారు. అలాంటిది జగన్, షర్మిల ఒకటేనని మోడీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ను ఏటిఎం లాగా వాడుకున్నారంటూ గతంలో చంద్రబాబుపై విమర్శలు చేసిన మోడీకి ఇప్పుడు పునీతుడు అయిపోయాడా అంటూ నాని సూటిగా ప్రశ్నించారు.
ఎన్డీయే ప్రభుత్వం వల్ల ఏపీకి జరిగిన ఒక్క మేలు ఏమిటో చెప్పాలని, అందరికీ ఇచ్చినట్లే తమకూ జాతీయ విద్యాసంస్థలు ఇచ్చారని, ప్రత్యేకంగా ఏమి చేశారని అడిగారు. ఈ పొత్తుతో మీకు తప్ప రాష్ట్రానికి ఏమి లాభం ఉంటుందని, పవన్ తన ప్రసంగంలో జగన్ ను తిట్టడం తప్ప రాష్ట్రానికి ఏమి కావాలో ఒక్క మాట కూడా చెప్పలేదని పేర్ని నాని ధ్వజమెత్తారు.