Saturday, July 27, 2024
Homeస్పోర్ట్స్WPL: సీజన్ 2 విజేత బెంగుళూరు

WPL: సీజన్ 2 విజేత బెంగుళూరు

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ -2 టైటిల్ ను రాయల్ ఛాలెంజెర్స్ బెంగుళూరు (ఆర్సీబీ) గెల్చుకుంది. నేడు జరిగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి విజేతగా నిలిచింది.

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ జట్టు తొలి వికెట్ కు 64 పరుగుల చక్కని భాగస్వామ్యం నెలకొల్పినా బెంగుళూరు బౌలర్ సోఫీ మోలినెక్స్ ఎనిమిదో ఓవర్లో మూడు వికెట్లు తీసి ప్రత్యర్ధిని కోలుకోలేని దెబ్బ తీసింది.  ఓపెనర్ షఫాలీ వర్మ 27 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 పరుగులు చేయగా…. జెమైమా రోడ్రిగ్యూస్, ఆలీస్ క్యాప్సీ లు డకౌట్ గా వెనుదిరిగారు. ఆ తర్వాత మరో బౌలర్ శ్రేయంకా పాటిల్ ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ ను కకావికలం చేసి నాలుగు వికెట్లతో సత్తా చాటింది.

మరో ఓపెనర్, కెప్టెన్ మెగ్ లన్నింగ్ 23 పరుగులు చేసి నాలుగో వికెట్ గా శ్రేయంకా బౌలింగ్ లో ఎల్బీగా  ఔటయ్యింది.  ఆ తర్వాత వచ్చిన వారిలో రాధా యాదవ్ 12; అరుంధతి రెడ్డి 10 పరుగులతో రాణించారు. మిగిలిన వారు విఫలం కావడంతో 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్ అయ్యింది. శ్రేయంకా 4; మోలినెక్స్ 3; ఆశా శోభన 2 వికెట్లు పడగొట్టారు.

ఆ తర్వాత బెంగుళూరు ఓపెనర్లు తొలి వికెట్ కు 49 పరుగులు చేశారు. కెప్టెన్ స్మృతి మందానా 31 పరుగులు చేసి ఔటయ్యింది. మరో ఓపెనర్ సోఫీ డివైన్ 27 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ తో 32 పరుగులు చేసింది. ఎల్లీస్ పెర్రీ 35- రిచా ఘోష్ 17 పరుగులు చేసి మరో వికెట్ పడకుండా ఆడి మరో మూడు బంతులు మిగిలి ఉండగానే జట్టును విజేతగా నిలిపారు. ఢిల్లీ బౌలర్లలో శిఖా పాండే, మిన్ను మణి చెరో వికెట్ పడగొట్టారు.

మూడు వికెట్లతో పాటు ఓ రనౌట్ చేసిన మోలినెక్స్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్…. దీప్తి శర్మకు ప్లేయర్ అఫ్ ద సిరీస్ లభించాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్