Friday, November 22, 2024
HomeTrending Newsపుతిన్ గెలుపు.. పాశ్చాత్య దేశాలకు కంటగింపు

పుతిన్ గెలుపు.. పాశ్చాత్య దేశాలకు కంటగింపు

రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్‌ పుతిన్‌ మరోసారి ఘన విజయం సాధించారు. దీంతో ఆయన ఐదోసారి దేశాధ్యక్ష పదవిని చేపట్టనున్నారు. ప్రాథమిక ఫలితాల ప్రకారం పుతిన్‌కు రికార్డు స్థాయిలో 87.8 శాతం ఓట్లు నమోదయ్యాయి. ఉక్రెయిన్‌లోని ర‌ష్యా ఆక్ర‌మిత ప్రాంతాలైన జ‌పొరిజియా, ఖేర్స‌న్, డోన‌స్కీ, లుహాన్స్‌, క్రిమియాలో కూడా ఓట్లు వేశారు. మార్చి 15న ప్రారంభమైన ఎన్నికల పోలింగ్‌ మూడు రోజుల పాటు జరిగి 17న ముగిశాయి.

1999 నుంచి దేశ అధ్యక్షుడిగా కొనసాగుతున్న పుతిన్‌.. తాజా విజయంతో మరో ఆరేండ్లపాటు పదవిలో ఉండనున్నారు. రష్యాలో ఎక్కువ కాలం అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తిగా జోసెఫ్‌ స్టాలిన్‌ను అధిగమించారు. ఈ ఎన్నికల్లో పుతిన్‌తో కలిపి నలుగురు అధ్యక్ష పదవికి పోటీపడ్డారు. ప్రధాన ప్రత్యర్థి నావల్నీ ఎన్నికలకు ముందే చనిపోవడంతో పోటీయే లేకుండా పోయింది.

చివరిరోజు ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు బారులు తీరారు. ఉక్రెయిన్‌ యుద్ధాన్ని, పుతిన్‌ విధానాలను వ్యతిరేకిస్తున్నవారు పోలింగ్‌ కేంద్రాలకు రావాలని దివంగత విపక్ష నేత నావల్నీ మద్దతుదారులు పిలుపునివ్వడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. పలు పోలింగ్‌ కేంద్రాల్లో ఘర్షణలు కూడా జరిగాయి.

దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో విజయం సాధించిన త‌ర్వాత పుతిన్‌ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అమెరికాలో జ‌రుగుతున్న ప‌రిణామాల ప‌ట్ల యావ‌త్ ప్ర‌పంచ దేశాలు న‌వ్వుకుంటున్నాయని.. అది ప్ర‌జాస్వామ్య దేశం కాదు అని పుతిన్ ఆరోపించారు.

ప్రస్తుత అమెరికా ప్రభుత్వం దేశాధ్య‌క్ష అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న వ్య‌క్తిపై దాడి చేస్తోంద‌ని ఆరోపించారు. డోనాల్డ్ ట్రంప్‌ను బైడెన్ ప్ర‌భుత్వం వేదిస్తోందని… అభ్య‌ర్థి రేసులో ట్రంప్ ముందు వ‌రుస‌లో ఉన్నా.. ప్ర‌భుత్వం కేసులతో నిర్వీర్యం చేస్తోంద‌న్నారు. విదేశీ ఎన్నిక‌ల్లో ర‌ష్యా జోక్యం చేసుకోదన్న పుతిన్.. అమెరికా అధ్య‌క్షుడిగా ఎవ‌రు ఎన్నికైనా వారితో ర‌ష్యా క‌లిసి ప‌నిచేస్తుంద‌న్నారు.

ర‌ష్యా ప్రతిప‌క్ష నేత అలెక్సీ నావ‌ల్నీ మృతిపై పుతిన్‌ తొలిసారి స్పందించారు. ఖైదీల మార్పిడి కింద నావల్నీని రష్యా జైలు నుంచి విడుదల చేయాలనుకున్నామని… అంతలోనే ఆయన మరణించారన్నారు. ఖైదీల మార్పిడి కింద నావల్నీని అప్పగించి పాశ్చాత్య దేశాల జైళ్లలో ఉన్న రష్యా పౌరులను తీసుకొద్దామనే ప్రతిపాదన సహచరులు తన ముందు ఉంచినట్లు చెప్పారు. ఇందుకు అంగీకారం కూడా తెలిపానని.. చర్చలు తుదిదశలో ఉండగా.. ఇలా జరిగిపోయిందన్నారు.

ఆర్మీ నేపథ్యం ఉన్న పుతిన్ గెలవటం అమెరికా, నాటో కూటమి దేశాలకు పక్కలో బల్లెం అనే చెప్పుకోవచ్చు. ఉక్రెయిన్ పై వెనక్కి తగ్గని పుతిన్.. పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా చైనాతో జతకట్టారు. రెండు దేశాల మధ్య సరిహద్దు సమస్యలు ఉన్నా ఉమ్మడి శత్రువు అమెరికాను నిలువరించేందుకు పరస్పరం సహకరించుకుంటున్నాయి.

అంతర్జాతీయ వేదికలపై అండగా ఉండి.. భారత్ ను నమ్మకమైన మిత్రుడిగా పేర్కొనే పుతిన్ అధికారంలో ఉండటం మనకు మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు. చైనాతో సరిహద్దు వివాదాల్లో భారత్ కు అండగా ఉంటారు. అమెరికా స్వీయ ప్రయోజనాల కోసం భారత్ కు మద్దతు ఇస్తే.. భారత్ ను ఆప్త మిత్రుడిగా రష్యా భావిస్తుంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్