ప్రత్యక్ష నగదు బదిలీ (డిబిటి)-నాన్ డిబిటి ద్వారా పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఎలాంటి వివక్షా లేకుండా అందించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తమ కంటే ముందు చాలా ప్రభుత్వాలు చూశారని, వయసులో తానూ చిన్నవాడినని.. వయసులో, అనుభవంలో తనకంటే ఎంతో పెద్దవారు అని చెప్పుకునేవారు గతంలో ఇలాంటి పథకాలు ఎందుకు అమలు చేయలేకపోయారని సూటిగా ప్రశ్నించారు. తనకంటే ముందు 75 ఏళ్ళ ముసలాయన కూడా సిఎంగా పని చేశారంటూ బాబుపై పరోక్షంగా సెటైర్లు వేశారు. 14 ఏళ్ళు సిఎంగా పని చేశానని చెప్పుకునే ఆయనకు ఈ సంక్షేమం అందివ్వాలని అనిపించలేదని పేర్కొన్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం పరిధిలోని ఎర్రగుంట్లలో గ్రామ ప్రజలతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు.
అన్ని వర్గాల ప్రజలకూ కావాల్సిన అవసరాలను తీర్చామని, రైతులకు గ్రామస్థాయిలోనే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి, పెట్టుబడి సాయం అందించిన గొప్ప మార్పు కూడా తమ పాలనలోనే జరిగిందన్నారు.
వ్యవసాయం మారింది, స్కూళ్ళు, హాస్పటళ్ళు మారాయి, ఆరోగ్యశ్రీని విస్తరించం, ఏకంగా 3300 ప్రోసీజర్ల వరకూ తీసుకెళ్ళాం, 25 లక్షల రూపాయల వరకూ ఆరోగ్యశ్రీని పెంచామని వివరించారు. మార్పులు ఏ స్థాయిలో ఉన్నాయో గమనించాలని కోరారు. 58 నెలల పాలనా కాలంలో ఎంత మార్పు తీసుకు వచ్చామో చూడాలని, తమకు మద్దతిచ్చి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇది కేవలం ఎంపిలు, ఎమ్మెల్యేలను ఎన్నుకునేందుకు వేసిన ఓటు కాదని… మన భవిష్యత్తు కోసం వేస్తున్న ఓటు గా గుర్తించాలన్నారు.