Saturday, July 27, 2024
HomeTrending Newsమరో నలుగురు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన

మరో నలుగురు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన

లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే 14 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను కాంగ్రెస్‌ పార్టీ బుధవారం రాత్రి విడుదల చేసింది.  తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌లో నాలుగు, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌లో చెరో మూడు స్థానాలకు కలిపి మొత్తంగా 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ, నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, మెదక్ నుంచి నీలం మధు పేర్లను ప్రకటించారు. నలుగురిలో ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం కాగా ఒకరు బిసి, మరొకరు ఆదివాసి సామాజికవర్గం వారు.

ఆదిలాబాద్ ఎంపి అభ్యర్థిగా ఆత్రం సుగుణ పేరు ఖరారు కావటం పై ఆదివాసి నాయకులు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఆత్రం సుగుణ గతంలో మావోయిస్టు నేతగా.. కలమడుగు ఎంపిటిసిగా.. ఆ తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో సీఏం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సుగుణను పార్టీలోకి తీసుకొచ్చేందుకు మంత్రి సీతక్క చొరవ తీసుకున్నారు.

ఆదిలాబాద్ లో ప్రధాన పార్టీల అభ్యర్థులు అందరు ఆదివాసేలే కావటం గమనార్హం. బిజెపి నుంచి గోడం నగేష్, బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు పోటీలో ఉన్నారు. రాజకీయాలకు కొత్త అయిన సుగుణకు నక్సల్ నేపథ్యం… మంత్రి సీతక్క ప్రచారం కలిసి వస్తుందని కాంగ్రెస్ అంచనా.

నిజామాబాద్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు ప్రకటనపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న జీవన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితులే. గ్రూపు రాజకీయాలకు నెలవైన కాంగ్రెస్ లో బోధన, నిజామాబాద్, బాల్కొండ నేతల సహకారం మీదనే జీవన్ రెడ్డి గెలుపు ఓటములు ఆధారపడి ఉన్నాయి. ఎమ్మెల్సీగా గెలిచాక లోక్ సభ పరిధిలో జరిగే ప్రజా ఆందోళనల్లో జీవన్ రెడ్డి ముందున్నారు.

నిజామాబాద్ నుంచి బిజెపి అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపి ధర్మపురి అరవింద్, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత కావటం, క్లీన్ చీట్ ఉండటం జీవన్ రెడ్డికి కలిసి వచ్చే అంశాలు. జగిత్యాల, కోరుట్ల, ఆర్మూర్ ప్రాంతాల్లో జీవన్ రెడ్డికి ఓడిపోయారనే సానుభూతి ఉంది.

మెదక్ నుంచి నీలం మధు ముదిరాజ్ పేరును ఖారారు చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. శాసనసభ ఎన్నికల్లో మొదట కాంగ్రెస్ అనుకోని ఆ తర్వాత టికెట్ ఇవ్వలేదు. దీంతో BSP అభ్యర్థిగా పటాన్ చెరువు నుంచి నీలం పోటీ చేశారు. ఈయన పోటీతో కాంగ్రెస్ కు నష్టం జరిగి బీఆర్ఎస్ గెలిచింది. తిరిగి పార్టీలో చేర్చుకొని ఏకంగా మెదక్ ఎంపి టికెట్ కట్టబెట్టారు.

మెదక్ నుంచి బిజెపి అభ్యర్థిగా రఘునందన్ రావు, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ వెంకట్ రామి రెడ్డి తలపడుతున్నారు. బిసి కార్డు నీలం మధు ద్వారా పనిచేస్తుందని కాంగ్రెస్ విశ్వాసంతో ఉంది. ముదిరాజ్ సామాజిక వర్గం ఓట్లు ఈ నియోజకవర్గంలో గణనీయంగా ఉన్నాయి.

భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వటంపై పార్టీ నేతల్లో హర్షం వ్యక్తం అవుతోంది. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పటి నుంచి ఉన్నారని.. రేవంత్ రెడ్డి సహచరుడిగా చామలకు పేరుంది. భువనగిరి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మి చివరి వరకు ప్రయత్నాలు చేశారు. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆయన కుమార్తె శ్రీనిధి రెడ్డికి ఇవ్వాలని పలు సందర్భాల్లో అధిష్టానానికి విన్నవించారు. ఎట్టకేలకు అధిష్టానం చామల కిరణ్ కుమార్ పేరు ఫైనల్ చేసింది.

భువనగిరి నుంచి బిజెపి అభ్యర్థిగా మాజీఎంపి బూర నర్సయ్య గౌడ్, బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్ బరిలో ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం ఏకతాటి మీదకు వచ్చి చామలకు సహకరిస్తుందని కాంగ్రెస్ భరోసాతో ఉంది.

కాంగ్రెస్ కు సంబంధించి మరో నాలుగు స్థానాలు పెండింగులో ఉన్నాయి. వాటిలో ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌ ఉన్నాయి. ఈ నెల 31న జరిగే సమావేశంలో ఈ స్థానాలపైనా చర్చించనున్నట్టు తెలిసింది. ఏకాభిప్రాయం కుదరకపోవడంతోనే వీటిని పెండింగులో పెట్టినట్టు సమాచారం.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్