పంట పొలాల పరిశీలనకు కెసిఆర్ జనగామ వెళుతుంటే… స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లో సీఎం రేవంత్ నివాసంలో వారికి పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షి వారికి కాంగ్రెస్ కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు. కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ కూడా ఖాయం చేశారు.
తెలుగుదేశం హయంలో మంత్రిగా కడియం సుపరిచితులు. ముక్కుసూటిగా వ్యవహరించే ఈయన సుధీర్గ రాజకీయ జీవితంలో కాంగ్రెస్ తో ఏనాడు స్నేహం చేసింది లేదు. కెసిఆర్, ఆయన కుటుంబ సభ్యుల వ్యవహారశైలి నచ్చక బయటకు వచ్చారని అంటారు.
కడియం రాకలో ప్రభుత్వ సలహాదారు వెం నరేందర్ రెడ్డి కీలక పోషించారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో సిఎం రేవంత్ రెడ్డి సహా వీరిద్దరూ నేతలు సైకిల్ తో సవారి చేసినవారే. అప్పటి స్నేహం.. కడియంకు ఇప్పుడు కలిసి వచ్చింది.
వరంగల్ ఎంపి స్థానంలో ఈసారి ఓ గమ్మత్తు జరిగింది. బిజెపి అభ్యర్థి ఆరూరి రమేష్ వరం రోజులపాటు బీఆర్ఎస్ – బిజెపి నేతలను అయోమయానికి గురి చేసి చివరకు కమలం తీర్థం పుచ్చుకున్నారు. అదే రీతిలో పార్టీ టికెట్ ఇచ్చాక… అధినేతను కలిసి కృతజ్ఞతలు చేలిపి మరి కడియం కావ్య పార్టీ మారారు. అంతటితో ఆగకుండా కాంగ్రెస్ టికెట్ లో బరిలో దిగుతున్నారు. ఇద్దరు అభ్యర్థులు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారే కావటం గమనార్హం.
కడియం శ్రీహరిని కాంగ్రెస్‌లోకి తీసుకోవద్దని ఆ పార్టీ వివిధ మండలాల అధ్యక్షులు అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో మీడియా సమావేశాలు నిర్వహించి.. కడియం శ్రీహరి కాంగ్రెస్‌లోకి రావడంపై అభ్యంతరం తెలిపారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మండల అధ్యక్షుడు గుర్రపు ప్రసాద్ తీవ్ర ఆరోపణలు చేశారు.
కడియం గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను తీవ్రమైన ఇబ్బందులకు గురిచేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల్లోనే కూలిపోతుందని శాపనార్థాలు పెట్టి ఇప్పుడు పార్టీలోకి వస్తే స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రమాదంలో పడ్డట్లేనని పేర్కొన్నారు. వరంగల్ పార్లమెంట్ టికెట్ తన కూతురు కావ్యకు ఇప్పించి అసలైన కాంగ్రెస్ నాయకులకు తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.
-దేశవేని భాస్కర్