ప్రజలకు సేవలిందిచే వాలంటీర్లను గురించి నిత్యం శాపనార్దాలు పెట్టి, వారు మహిళలపై అఘాయిత్యాలు చేస్తారని, గోనెసంచులు మోస్తారని, అర్ధరాత్రి తలుపులు కొడతారని వ్యాఖ్యానించిన చంద్రబాబు నేడు వారికి పదివేలు ఇస్తానంటూ చంద్రబాబు చెబుతున్న మాటలను నమ్మేస్దితిలో ప్రజలు లేరని వైయస్సార్ సిపి రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. వాలంటీర్లు ఓటర్లను ప్రభావితంచేస్తారంటూ తన మనిషి నిమ్మగడ్డ ప్రసాద్ ద్వారా ఫిర్యాదులు చేయించింది,కేసులు వేయించి అడ్డుకుంది చంద్రబాబేనని ఆరోపించారు. అసలు వాలంటీర్లంటే వారికి నిజంగా ప్రేముంటే వాలంటీర్ల గురించి చంద్రబాబు,ఆయన దత్తపుత్రుడు మొన్నటివరకు ఏమి మాట్లాడారో మరిచిపోయారా అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ అయితే మహిళల ట్రాఫికింగ్ జరుగుతుందని మహిళలు అదృశ్యమవుతున్నారని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. చంద్రబాబు ఏమో వాలంటీర్లతో అరాచకాలు జరుగుతున్నాయని అన్నారు. లోకేష్ సైతం అలాంటి విషపు మాటలే మాట్లాడారు. ఆయన ఇంకా ముందుకు వెళ్లి తాము అధికారంలోకి వస్తే మా పార్టీ వారికి మాత్రమే పధకాలు ఇస్తాం అని మాట్లాడారని అన్నారు. ఆ మాటలను ప్రజలు మరిచిపోతారనుకుంటే వారి భ్రమేనని అన్నారు.
చంద్రబాబుకు అవకాశం ఇస్తే వాలంటీర్లను తీసేసి తిరిగి జన్మభూమి కమిటీలను తీసుకువస్తారని సజ్జల అన్నారు. వాలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేస్తారనడం అబద్ధమన్నారు. వాలంటీర్లు పెన్సన్ ఇవ్వకుండా అడ్డుకుంది చంద్రబాబే అని, 33 మంది వృద్ధుల చావుకు కూడా కారణమయ్యారని పైగా తమ వల్ల చనిపోయారంటూ ఎన్ హెచ్ ఆర్సికే ఫిర్యాదు చేశారని వారికి వీలుంటే ఐక్యరాజ్యసమితికైనా ఫిర్యాదు చేస్తారని ఎద్దేవా చేశారు. నిజానికి శవరాజకీయాలు చేసేది చంద్రబాబేనని వృధ్దుల మరణాలను వైసీపీకి అంటగట్టాలని చూస్తున్నారని విమర్శించారు. వాలంటీర్లు గత నాలుగున్నరేళ్ళుగా ఫించన్లు,వివిధ పధకాలను ప్రజలకు అందిస్తున్నారని, రెండు నెలలు అడ్డుకోవడం ద్వారా వారి ప్రభావాన్ని ఆపగలరకునుకుంటే భ్రమేనని అన్నారు.