Monday, June 17, 2024
HomeTrending Newsమద్యం కేసులో బిగుస్తున్న ఉచ్చు.. సిబిఐ అదుపులోకి ఎమ్మెల్సీ కవిత

మద్యం కేసులో బిగుస్తున్న ఉచ్చు.. సిబిఐ అదుపులోకి ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితను సిబిఐ అరెస్టు చేసింది. తీహార్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు ఈ రోజు (గురువారం) అదుపులోకి తీసుకున్నారు. రేపు (శుక్రవారం) కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు. తీహార్ జైలులో ఏప్రిల్ 6న కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. విచారణకు సహకరించకపోవటంతో, ఆమెకు వ్యతిరేకంగా ఆధారాలు ఉండటంతో కవితను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.

లిక్కర్ స్కాం కేసులో ఈడీ అధికారులు మార్చి 15న ఎమ్మెల్సీ కవిత అరెస్టు చేశారు. ఆ తరువాత ఆమెను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు మార్చి 26వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది. కస్టడీ గడువు ముగియడంతో.. కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆమెను తీహార్ జైలుకు తరలించారు. రెండు రోజుల క్రితం కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. దీంతో ఈనెల 23వ తేదీ వరకు ఆమె తీహార్ జైలులో ఉండనున్నారు.

అయితే, ఢిల్లీ లిక్కర్ కేసులో గతంలోనే కవితను సీబీఐ అధికారులు హైదరాబాద్ లో విచారించారు. ఈడీ అరెస్టు చేసిన తరువాత జైలులో ఈనెల 6న సీబీఐ అధికారులు కవితను విచారించారు. రెండు సార్లు విచారించినా.. ఆమె విచారణకు సహకరించకపోవటంతోపాటు.. ఆమెకు వ్యతిరేకంగా ఆధారాలు ఉండటంతో కవితను సీబీఐ అధికారులు తీహార్ జైలులోనే గురువారం అరెస్టు చేశారు. రేపు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చి సీబీఐ కస్టడీకి ఇవ్వాలని కోరనున్నారు.

ఇప్పటి వరకు ఢిల్లీ లిక్కర్ స్కాం మనీల్యాండరింగ్ కేసులోనే కవిత న్యాయపోరాటం చేస్తూ వస్తున్నారు. కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి కోర్టు అనుమతించడంతో ఆ కేసులోనూ ఇప్పటికే పిటీషన్ దాఖలు చేశారు. దీంతో కవితకు సీబీఐ కేసులోకూడా న్యాయపోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మార్చి 15న కవితను అరెస్టు చేసినపుడు హడావిడి చేసిన గులాబీ శ్రేణులు క్రమంగా ఎన్నికల కోలాహలంలో మునిగిపోయారు. జైలుకు వెళ్లి నెల రోజులు కావస్తోంది. నిజామాబాద్ లోక్ సభ అభ్యర్థిగా బరిలో ఉండాల్సిన కవిత జైలులో ఉండటం… నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలను సమన్వయము చేసే నేత లేకుండా పోయారు. తాజా పరిణామాలు పరిశీలిస్తే ఎన్నికల వరకు కవిత బయటకు వచ్చే అవకాశం లేదని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్