Sunday, May 26, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమన తెలుగు భాషను రక్షించుకోవాలి.. ఇలా చేయగలరా?

మన తెలుగు భాషను రక్షించుకోవాలి.. ఇలా చేయగలరా?

తెలుగు భాషను కాపాడుకోవడానికి ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేయాలి? ఎన్ని కఠిన ఉత్తర్వులివ్వాలి? అమలు చేయని వారిని ఎలా శిక్షించాలి? అని ఎంతయినా మాట్లాడుకోవచ్చు. ప్రభుత్వాలు, చట్టాలు, మాతృభాష పరిరక్షణ ఉద్యమాలు, అమ్మ భాషను కాపాడుకోవడానికి చైతన్య కార్యక్రమాల అవసరం లేకుండా వ్యక్తిగతంగా మనకు ఆ స్పృహ ఉంటే ఎవరికి వారు అత్యంత అందమైన మన తెలుగు భాషను ఎలా రక్షించుకోవచ్చో తెలిపే చిన్న ఉదాహరణ ఇది.

తెలంగాణ పోలీసు శాఖలో ఐజి స్థాయి ఉన్నతాధికారి మస్తిపురం రమేష్ తెలుగు భాషా ప్రేమికుడు. సాహితీ పిపాసి. సామాజిక అంశాలమీద చక్కటి వచన కవితలు రాస్తుంటారు. తెలుగు మాండలికాల మాధుర్యాన్ని కోరి కోరి జుర్రుకుంటూ ఉంటారు. తెలుగు పద్యాలు, పాటలకు పందిళ్లు వేసి పరవశిస్తూ ఉంటారు. ఇంట్లోనో, బయటో సొంత ఖర్చులతో ఒక సెలవు రోజు పాతికమంది తెలుగు ప్రేమికులను పిలిచి తెలుగులో మాట్లాడించి, పాడించి, తెలుగు రుచులను తినిపించి, ఆ తెలుగు వెలుగు పూల దారుల్లో మురిసిపోతూ ఉంటారు. (ఆయన నిర్వహించిన తెలుగు పందిట్లో మూడు, నాలుగు సార్లు గంటలు గంటలు తెలుగు పద్యాలు పాడి నన్ను నేను మరచిపోయాను)

రమేష్ ను తమ గృహప్రవేశానికి రావాల్సిందిగా ఆయన మిత్రుడు ఇంగ్లిష్ లో ఆహ్వాన పత్రిక పంపారు. తెలుగులో ఆహ్వాన పత్రిక పంపితేనే వస్తానని రమేష్ షరతు విధించారు. ఆ తెలుగు మిత్రుడు వెంటనే తెలుగులో పత్రిక పంపాడు. సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త వైరల్ అయ్యింది. అవ్వాలి కూడా. చదువుకున్న ఇద్దరు తెలుగువాళ్లు కలిస్తే తప్పనిసరిగా ఇంగ్లిష్ లోనే మాట్లాడుకోవాలని శాపమున్న రోజుల్లో ఊరికో మస్తిపురం రమేష్ ఉంటే చాలు. మస్తుగా తెలుగు పూలు పూచి…తెలుగు కాయలు కాచి…తెలుగు పండ్లు బండ్లకెత్తుకోవచ్చు.

ఈ సందర్భంగా హాస్యనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. ఆయన తెలుగు పద్య ప్రేమికుడు. నాటకాల్లో పద్యాలను రాగయుక్తంగా పాడగలరు. ఆయనతో నాది ఇరవై ఏళ్ల ప్రయాణం. ప్రతి మూడు నెలలకొకసారి పదిమంది తెలుగు ప్రేమికులకు ఆతిథ్యమిచ్చేవారు. ఇంట్లోనో, బయటో ఏర్పాటు చేసే ఈ తెలుగు ప్రేమికుల సమ్మేళనానికి అన్ని ఏర్పాట్లు ఆయనే చేసేవారు. మా ఆఫీసులో ఏర్పాటు చేసినా టిష్యు పేపర్లు మొదలు స్వీట్లు, హాట్లు, భోజనాలు అన్నీ ఆయనే తెచ్చేవారు. ఒక సెలవు రోజు ఉదయం పదకొండు గంటలకు మొదలైతే మధ్యాహ్నం భోజనాలయ్యాక రెండు గంటలకు ఎవరిదారిన వారు వెళ్లిపోయేవారు. ఆయన, నేను పద్యాలు పాడేవాళ్లం. కొందరు పాటలు పాడేవారు. కొందరు జానపదగీతాలు పాడేవారు. కొందరు ఎస్వీ ఆర్, ఎన్ టీ ఆర్ పౌరాణిక సినిమా డైలాగులు చెప్పేవారు. నేను ఎన్ని పద్యాలు పాడినా.. చివర జాషువా శ్మశానవాటి, విద్వాన్ విశ్వం పెన్నేటి పాట, కొడాలి వెంకట సుబ్బారావు హంపీ క్షేత్రం పద్యాలు పాడకపోతే వదిలిపెట్టేవారు కాదు. “శిలలు ద్రవించి ఏడ్చినవి..” అని పలవరిస్తూ ఏదో లోకంలోకి వెళ్లినట్లు పరవశంతో ఈ పద్యానికి ఇంకొక స్వీట్ తినాల్సిందే అని బలవంతపెట్టి నా నోట్లో స్వీట్లు నింపి వెళ్లేవారు.

ధర్మవరపు సుబ్రహ్మణ్యాలు, రమేష్ లు ఏవో అవార్డులకోసమో, గుర్తింపు కోసమో తెలుగునామ స్మరణ చేయలేదు. వారు తెలుగువారు కాబట్టి తెలుగులో అలోచించి.. తెలుగులోనే మాట్లాడాలని అనుకున్నారు.

…మరి మనం?

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్