Monday, June 17, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపుస్తకాల బరువు తగ్గించే పనిలో ప్రభుత్వాలు

పుస్తకాల బరువు తగ్గించే పనిలో ప్రభుత్వాలు

“చదివించిరి నను గురువులు
చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నే
జదివినవి గలవు పెక్కులు
చదువులలో మర్మ మెల్ల జదివితిఁ దండ్రీ!”
-పోతన భాగవతంలో ప్రహ్లాదుడు

“నాటికి నాడే నా చదువు…మాటలాడుచును మరచేటి చదువు…”
-అన్నమయ్య కీర్తన

“చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకమ్ము గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్
బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పులేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా!”
-భాస్కర శతకం

“చందమామను చూచి వద్దామా?
సదానందా!
చదువులన్నీ చదివి…చదివీ చచ్చిపోయేదింతె గానీ
గుట్టు తెలిపే గురుడు గల్గితే చూడవచ్చును సులభమున్నాది…”
-కైవార తాతయ్య తత్త్వం

యుగయుగాలుగా చదువుకుంటూనే ఉన్నాం. ఇంకెన్ని యుగాలయినా చదువుకుంటూనే ఉంటాం. ఈ యుగంలో చదువు ‘కొంటూ’ ఉంటాం. మనకు మనంగా చదువుకోనయినా చదువుకోవాలి. మనం చదువుకోలేనప్పుడు ఇంకొకరు మన చేత చదివించాలి లేదా చదివింపచేయాలి. ఏదీ కానప్పుడు డబ్బు పెట్టి చదువు కొనాలి.

ధర్మార్థ శాస్త్రాల చదువులతో పాటు…చదువులలోని “మర్మం” కూడా చదివాను అన్నాడు ఆరేళ్ల కాన్వెంటు పిల్లాడు ప్రహ్లాదుడు. ఆ యుగంలో కాబట్టి ఆరేళ్లకే అన్ని శాస్త్రాలూ సిలబస్ లో ఉండి ఉంటాయి. దేవతలే నిలువెల్లా వణికిపోయే హిరణ్యకశిపు చక్రవర్తి కొడుకయినా ప్రహ్లాదుడు అందరితో పాటు ఆరుబయట వారి ఊరి వీధి బడికే వెళ్లాడు. ఆటపాటల మధ్య రాక్షస గురువులు చండామార్కులు చెప్పినవే కాకుండా ఇష్టంగా, సొంతంగా ఎన్నెన్నో విషయాలు నేర్చుకున్నాడు. ఓపెన్ స్కూల్ సిస్టం కాబట్టి గురువుల్లేనప్పుడు తోటి పిల్లలకు క్లాసులు కూడా తీసుకున్నాడు.

అన్నమయ్య చెప్పిన సందర్భం భక్తికి సంబంధించినది కావచ్చు కానీ…ఏ రోజుకు ఆ రోజే ఆ చదువు…మాటల్లో పడితే మరచిపోయే చదువు…అని సారాన్ని గ్రహించవచ్చు.

ఎంత చదువు చదివినా రసజ్ఞత- అందులో సారాన్ని, భావాన్ని గ్రహించకపోతే…కూర ఎంత గొప్పగా వండినా…అందులో చిటికెడు ఉప్పు లేకపోతే ఎలా ఉంటుందో…ఆ చదువు కూడా అలాగే అఘోరిస్తుందని భాస్కరుడు చదువు చెప్పాడు.

చచ్చేలా చదివి…చదివీ…అలసిపోవాల్సిందే కానీ…అందులో గుట్టు విప్పి చెప్పే గురుడు దొరక్కపోతే…ఎంత చదివినా బుర్రకెక్కుతుందా అని తెలుగు, సంస్కృతం, కన్నడలో ఏకకాలంలో తత్వాలు రాసిన కాలజ్ఞాని కైవార తాతయ్య ఏనాడో ప్రశ్నించాడు.

మార్కులు, ర్యాంకులు తప్ప ఇంకేదీ చదువు కానే కాదనే రోజుల్లో ఉన్నాం. బండెడు పుస్తకాలు మోసే పిల్లల వీపు మీద ఉన్న బరువు- గోడౌన్లలో మూటలు మోసే కూలీల వీపు మీద ఉన్న బరువుకు ఏమాత్రం తక్కువ కాదు. టెక్స్ట్ బుక్, వర్క్ బుక్, నోట్ బుక్, రఫ్ బుక్, హోం వర్క్ నోట్ బుక్, జామెట్రీ బాక్స్, స్నాక్ బాక్స్, వాటర్ బాటిల్, పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్లు…ఇలా ఒక్కొక్క విద్యార్థి ఒకటో క్లాసు నాటికే తప్పనిసరిగా తీసుకెళ్లాల్సిన లిస్టు కొండవీటి చేంతాడు కంటే పెద్దది. ఒక హై స్కూల్ విద్యార్థి క్లాసుకు బయలుదేరితే ఒక స్టేషనరీ షాపు నడిచి వెళుతున్నట్లు ఉంటుంది.

ఆడుతూ…పాడుతూ…ఆనందంగా, ఇష్టంగా చదువుకోవాల్సిన పిల్లలు బ్యాగుల మూటల బరువులు మోస్తూ…బాధగా, అయిష్టంగా చదువుకుంటున్నారు. క్లాసులు, ట్యూషన్లు, హోం వర్కులు ఎలాగూ ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ మెగా సెల్ఫ్ డిస్ట్రక్టివ్ లాంగ్ టర్మ్ కోచింగ్ లాంటి చిత్ర విచిత్ర విద్యలు అదనం.

చదివే పిల్లలకు మార్కులు, ర్యాంకులు తప్ప ఇంకేమీ కనపడకూడదు. తల్లిదండ్రులకు ఐ ఐ టీ, నీట్ ఎయిమ్స్ తప్ప ఇంకే కలలు రావు. టీచర్లకు రుబ్బుడు రోలు చదువులు తప్ప ఇంకేమీ ఉండకూడదు. యాజమాన్యాలకు వసూలు చేసుకునే ఫీజులు తప్ప ఇంకేమీ పట్టదు. ఒత్తిడి తట్టుకోలేక చివరికి పేరు గొప్ప ఐ ఐ టీ ల్లో కూడా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా…మన చదువుల దాహం తీరట్లేదు. పది కాలాలపాటు పచ్చగా బతికి ఎదగాల్సిన పిల్లలు పది లోనే తలలు వాలుస్తున్నా మన చదువుల తపన తగ్గడం లేదు. బతుకు పాఠాలు చెప్పని బడుల్లో సమాధానాలు లేని ప్రశ్నలుగా పిల్లలు మిగిలిపోతున్నా మనం సమాధానాలు వెతకడం లేదు.

బడి పిల్లల మీద ఒత్తిడి తగ్గించాలని ఇప్పటికే సవాలక్ష కమిటీలు ప్రభుత్వాలకు సిఫారసు చేశాయి. చదువుల ఒత్తిడి సంగతి తరువాత…ముందు బండెడు పుస్తకాల బరువునయినా తగ్గించండి అని అనేక నిపుణుల కమిటీలు కోరాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొంతకాలం క్రితం ఒక ముందడుగు వేసింది. కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రయివేటు బడుల్లో ప్రతి నెలా మూడో శనివారాన్ని స్కూల్ బ్యాగ్ రహిత దినంగా పాటిస్తున్నారు. కన్నడలో దీనికి “సంబ్రమ శనివార” అని నామకరణం చేశారు. అంటే ఉత్సాహంగా, ఆనందంగా గడిపే రోజు. ఆ రోజు పాఠ్య పుస్తకాలకు సంబంధం లేని ఇతర విషయాల పీరియడ్లు ఉంటాయి. లోకజ్ఞానం కలిగించేలా ఆ పీరియడ్లను రూపొందించారు.

తాజాగా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2024-25 విద్యా క్యాలెండర్లో కూడా సంవత్సరంలో అప్పుడప్పుడు కలిపి మొత్తం పది రోజులపాటు స్కూల్ బ్యాగ్ తీసుకురావాల్సిన అవసరంలేని రోజులుగా నిర్ణయించారు. మంచిదే.

నిజానికి వారానికి ఒక రోజు ఇలా పెట్టినా మంచిదేనేమో! కనీసం ఇన్ని దశాబ్దాలకయినా బడి పిల్లలకు బ్యాగ్ బరువు లేని ఒక రోజును వరంగా ఇస్తున్నందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను దీనికి సిఫారసు చేసిన విద్యా పరిశోధన విభాగాలను అభినందించాలి. మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ప్రతిపాదన ఉన్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇప్పటికే అమలు చేస్తున్న రాష్ట్రాలు కూడా ఉండి ఉండవచ్చు.

నెలలో ఫలానా ఒక రోజు “ఉల్లాస శనివారం” అంటున్నామంటే…మిగతా 29, లేదా 30 రోజులన్నీ ఉల్లాసం లేని రోజులనే కదా అర్థం!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్