Monday, June 17, 2024
HomeTrending Newsపిన్నెల్లి హత్యకు టిడిపి కుట్ర: పేర్ని సంచలన ఆరోపణ

పిన్నెల్లి హత్యకు టిడిపి కుట్ర: పేర్ని సంచలన ఆరోపణ

ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హత్య చేసేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి  పేర్ని నాని సంచలన ఆరోపణ చేశారు. ఈ కుట్రలకు పోలీసులు కూడా సహకరిస్తున్నారని, హత్య ఆలోచనతోనే పిన్నెల్లి ఇంటి వద్ద బలగాలను తొలగించారని…. సిఐ నారాయణస్వామి టిడిపి నేతలకు తొత్తుగా ఉంటూ ఈ కుట్రకు పాల్పడుతున్నారని పేర్ని వెల్లడించారు. పిన్నెల్లికి ఏదైనా జరిగితే ఎస్పీ, ఐజి, జీపీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పక్కా ఆధారాలతోనే తాను మాట్లాడుతున్నానని, దీనిపై డిజిపి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాని తాము రాష్ట్రపతి, గవర్నర్, ప్రధానమంత్రి లకు మెయిల్స్  ద్వారా తెలియజేశామన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

పోలీసులు ఏకపక్షంగా వైసీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని, అసలు ముద్దాయిలను వదిలేసి తప్పు చేయని వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని నాని మండిపడ్డారు. హింస జరుగుతుందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదని… పాల్వాయిగేట్‌లో దౌర్జన్యం జరిగితే అడ్డుకోలేదని, వైసీపీ మద్దతుదారులు ఓటు వేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. గతంలో గొడవలు జరిగిన చోట కేవలం హోం గార్డులను పెట్టారని, ప్రశాంతంగా పోలింగ్ జరిగే గ్రామాల్లో పారా మిలిటరీ బలగాలను మొహరించారని… పిన్నెల్లి 11వ తేదీనాడే ఏయే ప్రాంతాల్లో బలగాలు అవసరమో ఈసీ దృష్టికి తీసుకు వెళ్లాలని కానీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని వివరించారు. ఉద్దేశపూర్వకంగా…. పురందేశ్వరి సూచనల ప్రకారం ఎక్కేడైతే అధికారులను మార్చారో అక్కడే ఎన్నికల ప్రక్రియ అపహాస్యం అయ్యిందని, విధ్వంసం జరిగిందని పేర్కొన్నారు.

పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేస్తే 13నే ఎందుకు కేసు నమోదు చేయలేదని, ఈ ఘటనపై అప్పుడే టీడీపీ ఎందుకు ఫిర్యాదు చేయలేదని పేర్ని ప్రశ్నించారు. డీజీపీకి సిట్ ఇచ్చిన నివేదికలో పిన్నెల్లి ప్రస్తావన కూడా లేదని,  ఈసీ కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్