వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం యాత్ర ఈనెల 24 వరకూ కొనసాగుతుందని, దీనిలో ఎలాంటి మార్పూ లేదని ఎమ్మెల్సీ, జగన్ పర్యటనల సమన్వయ కర్త తలశిల రఘురాం స్పష్టం చేశారు. మొన్న విజయవాడ నగరంలో జరిగిన దాడి దృష్ట్యా యాత్రను మరో రెండ్రోజుల్లో ముగిస్తారన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుందన్నారు. సిఎం జగన్ ప్రజలను కలవడంలో కూడా ఎలాంటి ఆంక్షలూ లేవని, అందరినీ కలుస్తారని… భద్రతా సిబ్బంది వారి పని వారు చేసుకుంటారని చెప్పారు.
కాగా, మొన్న దాడి తరువాత నిన్న యాత్రకు విరామం ఇచ్చారు. నేడు ఉదయం యాత్రను కొనసాగించారు. రోడ్ షో కు బయల్దేరే ముందు కేసరపల్లిలో జగన్ బసచేసిన ప్రాంతానికి పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు చేరుకొని ఆయన్ను పరామర్శించారు. బానినేని శ్రీనివాసరెడ్డి కుటుంబంతో సహా జగన్ ను కలిశారు. ఉప్పాల రాము-హారిక దంపతులు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, నర్నాల తిరుపతిరావు యాదవ్, జోగి రమేష్, వల్లభనేని వంశీ, శాసన మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, కారుమూరి నాగేశ్వర రావు, ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, మొండితోక జగన్ మోహన్ రావు తదితరులు జగన్ ను కలిసిన వారిలో ఉన్నారు.