మరో 25 రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తేనే ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పతకాలు కొనసాగుతాయని, కూటమికి ఓటేస్తే అవన్నీ మురిగిపోతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు. ఫ్యాన్ మీద రెండు ఓట్లు పడితేనే జగన్ మార్క్ పాలన, పాలనలో విప్లవాలు కొనసాగుతాయని లేదంటే చంద్రబాబు తరహా జన్మభూమి కమిటీలు వస్తాయని, ఆయనలోని చంద్రముఖి నిద్ర లేస్తుందని, ఐదేళ్ళు మీ రక్తం తాగేందుకు పశుపతి వస్తాదంటూ ప్రజలనుద్దేశించి పేర్కొన్నారు. కాకినాడ రూరల్ లో జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు.
చంద్రబాబు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని, కూటమికి ఓటేస్తే దాచుకోవడం, దోచుకోవడం మాత్రమే జరుగుతుందని విమర్శించారు. ఫ్యాన్ కు ఓటు వేస్తేనే అక్కా చెల్లెమ్మల రాజ్యం కొనసాగుతుందని, రాబోయే ఐదేళ్ళు మన బతుకులు ఎలా ఉండాలో మీ ఓటు మాత్రమే నిర్ణయిస్తుందని అన్నారు. అందుకే ఓటు వేసే ముందు కుటుంబంలోని ప్రతి ఒక్కరూ పిల్లలతో సహా ఆలోచన చేయాలని హితవు పలికారు. ఎవరి వల్ల మంచి జరిగిందో, ఎవరితో జరుగుతుందో చూడాలన్నారు. ఈసారి జరగబోయే ఎన్నికలు ఎమ్మెల్యే, ఎంపిలను ఎన్నుకునేందుకు మాత్రమే కాదని, రాబోయే ఐదేళ్లూ మీ జీవితాలను, తలరాతలను మార్చేవి అని గుర్తుపెట్టుకోవాలన్నారు. గత ఎన్నికల్లో వేరే పార్టీకి ఓటు వేసినవారు కూడా అలోచించి ఓటు వేయాలని, మీరు ఓటు వేయకపోయినా మీ ఇంటికి సంక్షేమ పథకాలు అందించిన సంగతి గుర్తుంచుకొని ఓటు వేయాలని కోరారు.
ప్రస్తుతం పోటీ చేస్తున్నది కూటమి కాదని, బాబు తన మనుషులను ఆయా పార్టీల్లోకి పంపి వారితో ఏర్పడిన కూటమి అని ధ్వజమెత్తారు. దత్తపుత్రుడి పార్టీ కూడా బాబు కోసమే పెట్టిన పార్టీ అని, ఆయన ఎక్కడ పోటీ చేయమంటే జీ హుజూర్ అంటూ ఆ పని చేయడమేనంటూ పవన్ పై మండిపడ్డారు. పవన్ కు జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళతాడని.. ఈ మ్యారేజ్ స్టార్ కు ఏ ప్రాంతంపైనా, ఏ భార్యపైనా ప్రేమ ఉండదని ఎద్దేవా చేశారు. కూటమిలోని బి ఫాం ఏ పార్టీదైనా యూనిఫాం మాత్రం బాబుదేనంటూ అభివర్ణించారు.