Sunday, May 26, 2024
HomeTrending Newsవాలంటీర్లూ...రాజీనామా వద్దు: చంద్రబాబు

వాలంటీర్లూ…రాజీనామా వద్దు: చంద్రబాబు

సిఎం జగన్  అధికార గర్వం తలకెక్కి అహంకారంతో విర్రవీగుతున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. రాష్ట్ర చరిత్రను మార్చే తరుణం వచ్చిందని, రాబోయేవి రాష్ట్ర భవిష్యత్ ను మార్చే ఎన్నికలని, ప్రజలంతా  కూటమికి మద్దతుగా నిలిచి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు సహకరించాలని కోరారు. కర్నూలు జిల్లా అలూరులో జరిగిన ప్రజాగళం బహిరంగసభలో బాబు ప్రసంగించారు. ఒక్క ఛాన్స్ అంటూ అడిగి అధికారంలోకి రాగానే అన్ని వ్యవస్థలనూ విధ్వంసానికి గురిచేశారని మండిపడ్డారు. అందుకే జగన్ కు జే’గన్’ రెడ్డి అని పేరు మారుస్తున్నానన్నారు.

అలూరులో ఓ సామాన్య కార్యకర్త వీరభద్ర గౌడ్ కు అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చామని, కర్నూలు పార్లమెంట్ కు ఓ కురుబ కులానికి చెందిన నాగరాజుకు అవకాశం ఇచ్చామని, ఎంపిటిసిగా ఉన్న వ్యక్తిని పార్లమెంట్ కు పంపుతున్న చరిత్ర తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు.  రాష్ట్రంలో పేదవాడి రాజ్యం రావాలని, ప్రజల్లో చైతన్యం రావాలని అన్నారు.

రాష్ట్రాన్ని జగన్ అప్పులకుప్పగా మార్చారని, రూ. 13 లక్షల కోట్లు అప్పు చేశారని…కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లోకి  రాష్ట్రాన్ని నెట్టివేశారని దుయ్యబట్టారు. పేదవాడి తలమీద చెయ్యి వేసి పదిసార్లు ఆ చెయ్యి కడుక్కుంటాడని.. జగన్ ఓ అపరిచితుడని అన్నారు. కర్నూలు జిల్లాలోని ముచ్చుమర్రి, గురు రాఘవేంద్ర,  సిద్దాపురం, ఓర్వకల్లు, పులికనుమ, అవుతు లాంటి ఎన్నో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం అని పేర్కొన్నారు. కర్నూలులో న్యాయ రాజధానిగా చేస్తానని చెప్పిన సిఎం జగన్ ఆ పని చేశాడా అని ప్రజలను ప్రశ్నించారు. తమ హయంలో క్వార్టర్ మందు బాటిల్ రూ. 6౦గా ఉండేదని, ఇప్పుడు దాన్ని రూ.200 కి పెంచారని, జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే 5౦౦ రూపాయలు పెంచుతారని చెప్పారు. పేదవాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని విషయాల్లో మాట తప్పిన, మడమ తిప్పిన జగన్ మోహన్ రెడ్డికి ఓటు వేయబోమని చెప్పాలని సూచించారు.

వాలంటీర్లు ఎవరూ రాజీనామా చేయవద్దని, తాము అధికారంలోకి రాగానే వారి జీతం పదివేలకు పెంచుతామని బాబు భరోసా ఇచ్చారు. ఎవరైనా రాజీనామా చేయాలని ఒత్తిడి తెస్తే చంద్రన్న వస్తున్నాడని చెప్పాలని….. అది పోయే ప్రభుత్వం – మాది వచ్చే ప్రభుత్వమని.. పోయే ప్రభుత్వాన్ని నమ్ముకుంటే ఉద్యోగం పోతుందని హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్