పశ్చిమ బెంగాల్ ఉన్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. 2016లో జరిగిన ఉపాధ్యాయుల నియామకాలను రద్దు చేస్తూ ఈ రోజు(సోమవారం) తీర్పు వెలువరించింది. జస్టిస్ దేబాన్సు బసక్, మహమ్మద్ షబ్బార్ రషీద్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలతో సుమారు 25,753 మంది టీచర్లు ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి.
ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లకు జరిగిన నియామకాలను రద్దు చేస్తున్నట్లు కోల్‌కతా హైకోర్టు తెలిపింది. ఆ ఉద్యోగులు ఇన్నాళ్లు తీసుకున్న జీతాన్ని కూడా వెనక్కి ఇవ్వాల్సి ఉంటుందని… 12 శాతం వడ్డీతో ఆ మొత్తాన్ని ఇవ్వాల్సి ఉంటుందని ఆదేశాల్లో పేర్కొన్నది. ఖాళీ ఓఎంఆర్ షీట్లు ఇచ్చి.. అక్రమరీతిలో ఉద్యోగాలు పొందినట్టు ఆరోపణలు ఉన్నాయి.
నాలుగు వారాల్లోగా టీచర్లు తమ జీతాలను వెనక్కి ఇచ్చేయాలని కోర్టు ఆదేశించింది. ఆ టీచర్ల నుంచి డబ్బును వాసులు చేసే బాధ్యత జిల్లా మెజిస్ట్రేట్లకు కల్పించారు. కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు.
లోక్ సభ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రభుత్వానికి సంకట స్థితి ఎదురయ్యింది. బిజెపితో హోరాహోరీ పోరు జరుగుతుండగా కోర్టు తీర్పు ద్వారా ప్రజల్లో తృణముల్ పార్టీపై వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే సందేశ్ ఖాలీ వ్యవహారంతో తృణముల్ కాంగ్రెస్ ఉత్తర 24 పరగణాల్లో గడ్డు స్థితి ఎదుర్కొంటోంది.
బిజెపి నేత, ప్రతిపక్ష నేత సువేందు అధికారి హైకోర్టు తీర్పుకు ముందురోజే ప్రకటన చేశారు. సోమవారం భారీ పేలుడు జరుగుతోందని..తృణముల్ తట్టుకోలేదని ప్రకటన విడుదల చేశారు. సువేందు ప్రకటన కోర్టు తీర్పు గురించే అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
-దేశవేని భాస్కర్