సామాన్య ప్రజలు చేసే గుండె చప్పుడు సిద్ధం అని, 58 నెలలుగా విప్లవాత్మక కార్యక్రమాలు చేపడుతూ సాగిన పాలన ఈ సిద్ధం అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టంచేశారు. ‘మేమంతా సిద్ధం’ పేరిట జరుగుతోన్న బహిరంగసభల్లో చివరి మీటింగ్ శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో నేడు జరిగింది. ఈ యాత్ర వైసీపీ జైత్రయాత్రకు సంకేతంగా నిలిచిందని, పులివెందులలో మొదలైన ఈ యాత్ర టెక్కలిలో ముగిసిందని, రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకూ సాగిన ఈ యాత్రలో జన సునామీ చూశామన్నారు. 175 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపి సీట్లు మొత్తం గెల్చుకొని డబుల్ సెంచరీ కొడతామని ధీమా వ్యక్తం చేశారు.
పేద ప్రజల పట్ల తనకున్న ప్రేమ ఈ దేశ రాజకీయ చరిత్రలో మరే నాయకుడిగా ఉండదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, పేదలకు తాను చేయలేని ఏ స్కీమునూ బాబు కాదు కదా ఆయన జేజెమ్మ కూడా చేయలేరని తేల్చి చెప్పారు. అమలు చేయలేని ఏ వాగ్ధానాన్నీ మేనిఫెస్టోలో పెట్టె ప్రసక్తే లేదని, మోసపు వాగ్దానాలు చేసే ప్రసక్తే లేదన్నారు. ‘నా రాష్ట్ర ప్రజలను, నన్ను నమ్ముకున్న వారినీ ఎన్నడూ మీ బిడ్డ మోసం చేయడు- చంద్రబాబు పెట్టే వాగ్ధానాల వేలంలో మీ బిడ్డ పాల్గొనడు’ అంటూ ప్రజలనుద్దేశించి పేర్కొన్నారు. ప్రజల మనసులను మోసంతో కాకుండా నిజాయతీతో జయించవచ్చని నిరూపిస్తానని ధీమాగా చెప్పారు. మంచి చేశానన్న ఆత్మసంతృప్తితో మీముందు నిలబడి ఓట్లు అడుగుతున్నానని… మోసాల చంద్రబాబు కావాలో, విశ్వసనీయత ఉన్న జగన్ కావాలో తేల్చుకోవాలని విజ్ఞప్తి చేశారు.
చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు అన్నీ ఆగిపోతాయని, ఈ ఎన్నికలు ప్రతి ఇంటి భవిష్యత్తును నిర్ణయిస్తాయని…. జగన్ కు ఓటేస్తేనే పథకాలు కొనసాగుతాయని చెప్పారు. బాబు చెంప చెల్లుమనిపించేలా, జత కట్టిన జెండాలకు సరైన సమాధానం చెప్పాలని పిలుపు ఇచ్చారు.