Wednesday, May 15, 2024
HomeTrending Newsప్రత్యర్థులతో చేతులు కలిపారు: జగన్ ఆవేదన

ప్రత్యర్థులతో చేతులు కలిపారు: జగన్ ఆవేదన

వైఎస్ అవినాష్ రెడ్డి ఏ తప్పూ చేయలేదని తాను బలంగా నమ్మాను కాబట్టే అతనికి మరోసారి ఎంపి సీటు ఇచ్చానని వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వివేకాను చంపిందెవరో ఆయనకు, దేవుడికి, జిల్లా ప్రజలందరికీ తెలుసనీ కానీ తనపై బురదచల్లేందుకు తన ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. వివేకా హత్యపై అవినాష్ అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్పకుండా.. అతని రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి తన కుటుంబ సభ్యులే ప్రత్యర్థులతో చేతులు కలిపారని,  పెద్ద పెద్ద వాళ్ళంతా ఈ కుట్రలో భాగమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.  వివేకాను అతి దారుణంగా చంపి, తానే చంపానని చెప్పుకుంటూ తిరుగుతున్న హంతకుడికి మద్దతిస్తున్నది ఎవరో ఇక్కడి ప్రజలు చూస్తూనే ఉన్నారన్నారు. పులివెందుల అసెంబ్లీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్ధిగా వైఎస్ జగన్ నేడు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక సిఎస్ఐ చర్చి గ్రౌండ్స్ లో జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు.

తన చిన్నాన్నకు రెండో భార్య ఉన్నమాట వాస్తవం అవునా కాదా, ఆ రెండో భార్యతో ఆయనకు సంతానం ఉన్నమాట వాస్తవం కాదా?, ఎవరు ఫోన్ చేస్తే అవినాష్ అక్కడికి వెళ్ళాడు వంటి అనేక ప్రశ్నలు అవినాష్ లేవనెత్తారని, వీటికి బదులు చెప్పాలని అడిగిన వారిని కూడా అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు.

“నా పులివెందుకులకు, నా సొంత గడ్డకు, నా ప్రాణానికి ప్రాణం, నన్ను నిరంతరం ప్రేమించి ప్రతి కష్టంలోనూ నా వెంట నిలిచే నా ప్రతి అన్నకు, నా ప్రతి తమ్ముడికీ, నా ప్రతి అక్కకూ, నా ప్రతి చెల్లెమ్మకూ, నా ప్రతి అవ్వకూ, నా ప్రతి తాతకూ, నా ప్రతి స్నేహితుడికీ మీ బిడ్డ జగన్ రెండు చేతులూ జోడించి హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాడు” అంటూ తన ప్రసంగాన్ని ప్రారంచించారు.

ప్రత్యర్ధుల కుట్రలో భాగంగా వైఎస్సార్ వారసులం అంటూ కొంతమంది ప్రజల ముందుకు వస్తున్నారని… అసలైన వారసులు ఎవరో చెప్పాల్సింది ప్రజలేనని…. తన తండ్రిపై కక్ష పూరితంగా, కుట్రపూరితంగా కేసులు పెట్టిందీ, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసింది, సిబిఐ ఛార్జ్ షీట్ లో పేరు పెట్టింది ఎవరు అంటూ ప్రశ్నించారు. వైఎస్సార్ అనే పేరే లేకుండా చేయాలని చూసిన వారితో కలిసిపోయి, వారి పార్టీల్లో చేరిన వీరా వారసులు అని సూటిగా నిలదీశారు.

పులివెందుల అంటే ధైర్యం, నమ్మకం, అభివృద్ధి, సక్సెస్ స్టొరీ, ఇక ముందు కూడా కొనసాగే ఓ విజయగాథ అని అభివర్ణించారు. ఈ గడ్డకు కృష్ణా నీరు తీసుకు వచ్చి అభివృద్ధికి నాంది  పలికింది తన తండ్రి, మహానేత రాజశేఖర్ రెడ్డి అని వెల్లడించారు.

పులివెందుల రాష్ట్రానికి ఎంతో ఇచ్చిందని, తెలుగుదేశం మాఫియా నాలుగు దశాబ్దాల దుర్మార్గాలను ఎదిరించి నిలబడే ధైర్యాన్ని, మాట ఇస్తే మడమ తిప్పరన్న నమ్మకాన్ని, మోసం చేయరన్న విశ్వాసాన్ని, మన తెలుగు నెల మీద అణువణువునా నిలిపించి ఇక్కడి బిద్దలేనని భావోద్వేగంతో చెప్పారు. అందుకే బాబు, ఇతర మన ప్రత్యర్థులు పులివెందుల కల్చర్, రాయలసీమ కల్చర్, కడప కల్చర్ అంటూ మనమీద వేలెత్తి చూపుతున్తారని… కానీ మన కల్చర్ మంచి చేయడం, మంచి మనసు, మాట తప్పకపోవడం మన కల్చర్, బెదిరింపులకు లొంగక పోవడం మన కల్చర్ అని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్