Sunday, May 19, 2024
HomeTrending Newsచేవెళ్ళలో హోరాహోరీ పోరు

చేవెళ్ళలో హోరాహోరీ పోరు

చేవెళ్ళ లోక్ సభ నియోజకవర్గంపై హైదరాబాద్ ప్రభావం అధికంగా ఉంటుంది. రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, చేవెళ్ళ నాలుగు నియోజకవర్గాలు రాజధాని చుట్టూ ఉండగా మరో మూడు గ్రామీణ ప్రాంతాలతో ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎంపి గడ్డం రంజిత్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్, బిజెపి నుంచి మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి బరిలో ఉన్నారు.

దీని పరిధిలో చేవెళ్ళ, వికారాబాద్, తాండూర్, రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, పరిగి శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. చేవెళ్ళ, వికారాబాద్, తాండూర్ లకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తుండగా…మిగతా నాలుగింటిని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. నియోజకవర్గంలో సుమారు 25 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.

2009లో ఏర్పడిన చేవెళ్ళలో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి గెలవగా రెండోసారి బీఆర్ఎస్ నుంచి విశ్వేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. మూడోసారి బీఆర్ఎస్ తరపునే గడ్డం రంజిత్ గెలిచారు. మారిన రాజకీయ పరిణామాల్లో రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ నుంచి బరిలో ఉన్నారు.

వ్యక్తిగతంగా విశ్వేశ్వర్ రెడ్డికి క్లీన్ ఇమేజ్ ఉంది. నియోజకవర్గంలో ఒక బిజెపి ఎమ్మెల్యే లేకపోయినా క్యాడర్ బలంగా ఉంది. ఓటర్ల మనోగతం పరిశీలిస్తే నగర శివార్లతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రధాని మోడీ విధానాలు, కాంగ్రెస్ పాలనపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, బిజెపిల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.

పోల్ మేనేజ్మెంట్ లో విశ్వేశ్వర్ రెడ్డి వెనుకబడి ఉన్నారని అంటున్నారు. క్షేత్రస్థాయి రాజకీయాలు తెలియని బిజెపి అభ్యర్థి పూర్తిగా అపోలో సిబ్బంది మీద ఆధార పడతారని స్థానిక నేతలు అంటున్నారు. వాళ్ళ తీరుతోనే పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కొండ ఓటమి చెందారని కమలం శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

రంజిత్ రెడ్డి బస్తి మే సవాల్ అన్న రీతిలో ప్రచార పర్వం కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి వచ్చినా ఆ అనుమానమే రాకుండా హస్తం శ్రేణులతో కలిసిపోయి హుషారుగా ప్రచారంలో నిమగ్నం అయ్యారు. పార్టీ నేతల్లో పట్నం సునీత మీద కొంత అసంతృప్తి ఉండటంతో రంజీత్ రెడ్డిని కాంగ్రెస్ బరిలో నిలిపిందని సమాచారం. రంజిత్ రెడ్డి గెలుపు కోసం సిఎం రేవంత్ రెడ్డి కూడా నిత్యం నియోజకవర్గ నేతలతో మంతనాలు జరుపుతున్నారని తెలిసింది.

అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య రాజకీయ వైరుధ్యాలే కాని కెసిఆర్ అనుమతితోనే రంజిత్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం తీసుకొని బరిలో ఉన్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. వందల ఎకరాలా విలువైన భూములు రంజిత్ రెడ్డి కలిగి ఉన్నారని, సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు పార్టీ మారారని రెండు పార్టీల్లో చర్చ జరుగుతోంది.

బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బరిలో ఉన్నా నామమాత్రమే అని తెలిసింది. కాసానికి ఎన్నికల్లో పోటీ చేయటం హాబీగా వస్తోంది. ప్రతి ఎన్నికల్లో ఎదో ఒక పార్టీ నుంచి పోటీ చేయటం ఓటమి చెందటం సాధారణం. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి తప్పితే ఏనాడు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదు. పట్టు వదలని విక్రమార్కుడిలా ఎన్నికల బరిలో ఉండే కాసాని ఈ దఫా కారుతో షికారు చేస్తున్నారు.

కాసాని గెలుపు కోసం చేవెళ్ళ చెల్లమ్మ సబితా ఇంద్రా రెడ్డి చేమటోడుస్తున్నారు. బలహీనమైన అభ్యర్థి, పార్టీ వైఫల్యాలతో సబితా ఇంద్రారెడ్డికి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పట్టు ఉన్నా నిష్ప్రయోజనంగా మారుతోందని అనుచరులు మదనపడుతున్నారు. కార్తిక్ రెడ్డి పోటీచేసినా క్యాడర్ లో కొంత హుషారు వచ్చేదని అనుకుంటున్నారు.

కాసాని జ్ఞానేశ్వర్ పోటీతో ఏ పార్టీ ఓట్లు కొల్లగొట్టి.. ఎవరి ఓటమికి కారణం అవుతారో చూడాలి. అధికార పార్టీ అండదండలతో పాటు, ఎన్నికల్లో రంజిత్ రెడ్డి దిల్ దార్ గా ఉంటారని అనుమాయులు చెప్పుకుంటారు. గత ఎన్నికల్లో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటే విశ్వేశ్వర్ రెడ్డికి తిరుగు లేదు. విశ్వేశ్వర్ రెడ్డి, రంజిత్ రెడ్డిల్లో ఎవరు గెలిచినా రెండోసారి గెలిచిన అభ్యర్థిగా పేరొస్తుంది. చేవెళ్ళ జాగిర్దార్ ఎవరో నిర్ణయించేది రాజధాని శివారు నియోజకవర్గాలే కావటం గమనార్హం.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్