అత్యున్నత పదవిలో ఉన్న ఓ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయారు. 18.6 కోట్ల విలువైన 25 కేజీల బంగారాన్ని అక్రమంగా విదేశాల నుంచి భారత్‌కు తీసుకొచ్చి వార్తల్లో నిలిచారు. ఆ అధికారిణి భారత్‌లోని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ కాన్సుల్ జనరల్ జకియా వార్దక్.
వార్దక్ ఏప్రిల్ 25వ తేదీ సాయంత్రం 5:45 గంటల సమయంలో ఎమిరేట్స్ ఫ్లైట్‌లో కుమారుడితో కలిసి దుబాయ్ నుంచి భారత్ వచ్చారు. ముంబై చేరుకోగానే ఆమె గ్రీన్ ఛానెల్ ద్వారా విమానాశ్రయం బయటకు వచ్చారు. వార్దక్ బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కు ముందుగానే సమాచారం అందింది.
దీంతో వారు అప్రమత్తమై విమానాశ్రయంలో సిబ్బందిని మోహరించారు. దౌత్యవేత్త కావడంతో ఆమెకు తనిఖీల నుంచి మినహాయింపు ఇచ్చారు. విమానాశ్రయం వెలుపల డీఆర్‌ఐ అధికారులు ఆమెను అడ్డుకుని స్మగ్లింగ్ గురించి ఆరా తీశారు. బంగారం ఇతర వస్తువులేవైనా తీసుకెళ్తున్నారా అని ఆమెను ప్రశ్నించారు. అందుకు ఆమె అలాంటివేమీ తమ వద్ద లేవని సమాధానం చెప్పారు. దీంతో అధికారులు వార్దక్‌ను ఓ గదిలోకి తీసుకెళ్లి మహిళా అధికారులతో తనిఖీలు చేయించగా.. ఆమె బండారం బయట పడింది.
ఈ తనిఖీల్లో ఆమె ధరించిన జాకెట్, లెగ్గిన్, మోకాలి క్యాప్‌లో ఏకంగా 25 బంగారు కడ్డీలు బయటపడ్డాయి. ఆమె కుమారుడి వద్ద మాత్రం ఎలాంటి బంగారం కనిపించలేదు. దౌత్యవేత్త బంగారం స్మగ్లింగ్ చేయడం చూసి అధికారులు అవాక్కయ్యారు. బంగారానికి సంబంధించి సరైన పత్రాలు చూపించాల్సిందిగా వార్దక్‌ను డీఆర్‌ఐ అధికారులు అడగ్గా.. ఆమె చూపించలేకపోయింది. దీంతో ఆ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్ఘాన్ దౌత్యవేత్తపై కస్టమ్స్ చట్టం, 1962 కింద బంగారం స్మగ్లింగ్ కేసు నమోదు చేశారు. వార్దాక్‌కు దౌత్యపరమైన రక్షణ ఉండటంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేయకుండా వదిలేశారు.
బంగారం వ్యవహారంపై ఆఫ్ఘన్ దౌత్యవేత్త దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆరోపణలపై ఆందోళన చెందానని, ఈ విషయాన్ని మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. కాన్సులేట్ కి మద్దతుగా పని చేస్తున్న తాను ఇటీవల వ్యక్తిగత సవాళ్లు ఎదుర్కున్నట్టు వివరించారు. ఇలాంటి సమయంలో తనకు అండగా ఉండాలని ఇండియాను కోరింది. ఈ విషయం బయటకు పొక్కడంతో ఈ రోజు (మే 4) నుండి కాన్సుల్ జనరల్ పదవి నుండి తప్పించారని సమాచారం.
ఆఫ్గాన్ ప్రభుత్వ హయాం నుంఛి ముంబయిలో కాన్సుల్ జనరల్‌గా జకియా వార్ధక్ వ్యహరిస్తోంది. ఆప్గాన్ రాయబార కార్యాలయాన్ని మూసివేసిన తర్వాత కూడా ఆమె అదే స్థానంలో కొనసాగుతోంది. ఆప్ఘనిస్తాన్ తరపున కాన్సుల్ జనరల్ పదవి పొందిన తొలి మహిళగా గుర్తింపు పొందిన జకియా వార్దక్ ఈ విధంగా వార్తల్లోకి ఎక్కటం సంచలనంగా మారింది.
-దేశవేని భాస్కర్