రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్దిదారుల ఖాతాల్లో నిధులు జమ చేయడంపై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే బటన్ నొక్కిన పథకాల నిధులను ఎన్నికలు పూర్తయిన తరువాతే జమ జమ చేయాలని నిర్దేశించింది.
వివిధ పథకాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి సుమారు 14 వేల కోట్లు పైగా పంపిణీకి ప్రతిపాదనలు వచ్చాయని, దీనికి అనుమతిస్తే ప్రలోభాలకు అనుమతించినట్లు అవుతుందని అభిప్రాయపడింది. గత ఆరు నెలల నుంచి బటన్ లు నొక్కినా ఎందుకు బదిలీ చేయలేదని ప్రశ్నించింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ (డిబిటి) స్కీమ్ ద్వారా చెల్లించినప్పుడు 24 నుంచి 48 గంటల్లోగా లబ్ధిదారులు ఖాతాలో పడాలని నిబంధనలు చెబుతున్నాయని, అంతగా లబ్ధిదారులకు సొమ్ములు చెల్లించాలనుకుంటే ఈ నెల 13 తర్వాత బ్యాంకు నుంచి బ్యాంకుకు బదిలీ చేయవచ్చని సూచించింది. బటన్ నొక్కి ఐదు నెలలు గడుస్తున్నా జమ కావడానికి ఇంత జాప్జాయం ఎందుకు జరిగిందని ఈసీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించింది.
కాగా, ఇదే వాదనను ఈసీ ఏపీ హైకోర్టులో కూడా వాదించింది. తమకు రావాల్సిన పథకాల నిధులను ఆపివేయడం సరికాదని, వెంటనే నిధులు విడుదల చేసేలా ఆదేశాలు ఇవాలంటూ లబ్దిదారులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై నేడు సుదీర్ఘ వాదనలు జరిగాయి.