సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ జరుగుతుండటంతో అందరి దృష్టి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ మీద కేంద్రీకృతం అయింది. ఈ రోజు సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్‌పోల్స్ విడుదల కానున్నాయి. చివరి విడత పోలింగ్ ముగిసే దాకా ఎగ్జిట్‌పోల్స్ ప్రకటించవద్దని కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉన్నాయి.
దీంతో రాజకీయపార్టీలు, సర్వే సంస్థలు జూన్ 1వ తేదీ కోసం ఎదురుచూస్తున్నాయి. తెలంగాణలోని 17 లోక్‌సభ, ఒక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల ఫలితాల అంచనాలు శనివారం విడుదల కానున్నాయి. ముఖ్యంగా ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల ఎగ్జిట్ పోల్స్‌పైనే అందరి కండ్లూ నిలిచి ఉన్నాయి.
సాధారణంగా పోలింగ్ జరిగిన రోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తుంటారు. ఈసారి అందుకు భిన్నంగా సర్వే సంస్థలకు రెండువారాలకు పైగా సమయం దొరికింది. పోలింగ్ తర్వాత విస్తృతంగా సర్వే చేసి జనాభిప్రాయాన్ని తెలుసుకునే అవకాశం దక్కింది. ఇందుకు తగ్గట్టే అనేక సంస్థలు సుదీర్ఘంగా సర్వే కొనసాగించాయి. కాబట్టి ఈసారి ఫలితాలు మరింత కచ్చితత్వంతో ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భరోసా ఇస్తున్నారు.
రాజకీయ పార్టీలకు ఎన్నికల ప్రచారం సుదీర్ఘ కాలం సాగడం.. ఫలితాల కోసం నీరిక్షిస్తుండడం ఉత్కంటకు దారితీస్తోంది. ఈవీఎంలలో తీర్పు నిక్షిప్తం కాగా, ప్రజలు ఎటువైపు మొగ్గారోనని అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొన్నది. దీంతో సేదతీరెందుకు అగ్రనేతల నుంచి గల్లీ నేతల వరకు కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్ళారు.
కొందరు ఇంటికే పరిమితం కాగా, కొందరు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఫామ్‌హౌసుల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ రానుండంతో ఒక్కొక్కరు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. విహారయాత్రలకు వెళ్ళిన వారు తిరుగుపయనమయ్యారు. దేశవ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ తర్వాత చల్లబడ్డ రాజకీయ వాతావరణం ఎగ్జిట్ పోల్స్ విడుదలతో మళ్లీ వేడెక్కనున్నది.
-దేశవేని భాస్కర్