Friday, November 22, 2024
HomeTrending Newsఅరుంధతి రాయ్ పై ఉపా కేసు.. ప్రజా సంఘాల నిరసన

అరుంధతి రాయ్ పై ఉపా కేసు.. ప్రజా సంఘాల నిరసన

కేంద్రంలో ఎన్.డి.ఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రాగానే పౌర హక్కుల హననం మొదలైందని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించే వారిపై నిరాధారమైన ఆరోపణలతో కేసులు నమోదు చేస్తున్నారని మండిపడుతున్నాయి.

ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్‌తో పాటు, కశ్మీర్‌కు చెందిన మాజీ ప్రొఫెసర్‌లను చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (ఉపా) కింద ప్రాసిక్యూట్‌ చేయడానికి ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా అనుమతి ఇచ్చారు. 2010లో దేశ రాజధానిలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారన్న ఆరోపణలపై ఆరుంధతీ రాయ్‌ను, మాజీ ప్రొఫెసర్‌ షేక్‌ షౌకత్‌ హుస్సేన్‌ను ఉపా కింద విచారణ జరిపించడానికి గవర్నర్‌ అనుమతించినట్టు రాజ్‌ నివాస్‌ అధికారులు శుక్రవారం తెలిపారు.

న్యూఢిల్లీ మెట్రోపాలిటిన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఆదేశాల ప్రకారం అరుంధతీ రాయ్‌తో పాటు కశ్మీర్‌ ప్రొఫెసర్‌ షేక్‌ షౌకత్‌లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. దీనిపై రాయ్‌, షౌకత్‌ ఇంకా స్పందించ లేదు. భారత్‌ నుంచి కశ్మీర్‌ను వేరు చేసే అంశాలపై ‘ఢిల్లీలో ఆజాది-ద ఓన్లీ వే’ పేరిట 2010 అక్టోబర్‌ 21న జరిగిన సమావేశంలో చర్చలు జరిగాయి. అందులో పార్లమెంట్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడైన గిలానీతో పాటు అరుంధతీ రాయ్‌ తదితరులు దేశ సమగ్రతను రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్టు ఆరోపణలు నమోదయ్యాయి.

2010లో సామాజిక కార్యకర్త సుశీల్ పండిట్ ఫిర్యాదుతో కేసు నమోదు అయింది. న్యూఢిల్లీలోని కోపర్నికస్ మార్గ్‌లోని లిటిల్ థియేటర్ గ్రూప్ (ఎల్‌టిజి) ఆడిటోరియంలో ఆ ఏడాది అక్టోబర్ 21న ‘ఆజాదీ-ది ఓన్లీ వే’ బ్యానర్‌పై ఏర్పాటు చేసిన సదస్సులో రాయ్, హుస్సేన్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఆరోపించారు. ఆరుంధతీ రాయ్‌ను, మాజీ ప్రొఫెసర్‌ షేక్‌ షౌకత్‌ హుస్సేన్‌ లను తొందరలోనే పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్