ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు ఝలక్ ఇచ్చింది. మద్యం పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై స్టే విధించింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లేందుకు బెయిల్ ఉత్తర్వులపై 48 గంటల పాటు నిలుపుదల చేయాలన్న ఈడీ అభ్యర్థనను ప్రత్యేక జడ్జి నియయ్ బిందు గురువారం తిరస్కరించారు. రూ.లక్ష వ్యక్తిగత బాండ్ పూచీకత్తుపై కేజ్రీవాల్‌ను విడుదల చేయాలని ఆదేశించారు. ట్రయల్ కోర్టు తీర్పును చాలెంజ్ చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం ఉదయం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
ఈడీ తరపున న్యాయవాది ఏఎస్‌జీ ఎస్వీ రాజు వాదించారు. కేజ్రీవాల్ బెయిల్ దరఖాస్తును వ్యతిరేకించేందుకు దర్యాప్తు సంస్థకు పూర్తి అవకాశం ఇవ్వలేదని హైకోర్టుకు తెలియజేశారు. కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై స్టే విధించింది. ఈడీ పిటిషన్‌పై విచారణ పూర్తయ్యే వరకూ బెయిల్ మంజూరు చేయకూడదని స్పష్టం చేసింది.
24 గంటలు కూడా గడవకముందే బెయిల్ రద్దు కావటంతో కేజ్రివాల్ కు పచ్చి వెలక్కాయ గొంతులో పడినట్టైంది. కేజ్రీవాల్‌కు బెయిల్ నేపథ్యంలో ఆప్ నేతలు సంబరాలు చేసుకొన్నారు. కేజ్రీవాల్‌ను ఇరికించేందుకు రూపొందించిన ఫేక్ కేసు ఇది అని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ విమర్శించారు. సత్యం గెలిచిందని, కోర్టుల పట్ల విశ్వాసం ఉన్నదని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పోస్టు చేశారు. ఇంతలోనే ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో ఆప్ శ్రేణులు నిరాశ చెందాయి.
-దేశవేని భాస్కర్