కేరళలో కరోనా మహమ్మారి గడగడలాడిస్తుంటే ప్రతిష్టాత్మకమైన ఓనం పండుగ నేపథ్యంలో మలయాళీలు సామాజిక దూరం నిభందనల్ని ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దేవాలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో గుమికూడుతున్నారు. పది రోజుల పాటు జరిగే వేడుకలు ఈ రోజు నుంచి ప్రారంభం అయ్యాయి. ఓనం పురస్కరించుకొని తిరువనంతపురంలోని పద్మనాభ స్వామి ఆలయానికి ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. కోవిడ్ దృష్ట్యా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా భారీగా వస్తున్న భక్త జనాన్ని అదుపు చేయటం అధికార యంత్రాంగం వళ్ళ కావటం లేదు. అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో సాంస్కృతిక కార్యక్రమాల్ని ప్రభుత్వం నిషేధించింది. ఓనం నేపథ్యంలో నిర్వహించే పడవ పందాలు కూడా ఈ సంవత్సరం నిర్వహించటం లేదు.
గత పదిహేను రోజులుగా కేరళలో రోజుకు 20 వేలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదవుతున్నాయి. రోజు సుమారు వంద మందికి పైగా మృత్యువాత పడుతున్నారు. అనేక చోట్ల కాంటైన్మేంట్ జోనులు ఏర్పాటు చేశారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోపోతే ఈ పది రోజుల్లో మరిన్ని కేసులు పెరిగే ప్రమాదం ఉందని కేరళ వైద్య ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
మలయాళీల రాష్ట్ర పండుగ నేపథ్యంలో రాష్ట్రపతి రామనాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓనం శుభాకాంక్షలు తెలిపారు. కరోనా నిభందనలు పాటిస్తూ, మహమ్మారి వ్యాప్తికి అవకాశం ఇవ్వకుండా ఓనం వేడుకలు జరుపుకోవాలని రాష్ట్రపతి, ప్రధానమంత్రి సూచించారు.