Sunday, October 6, 2024
HomeTrending Newsఅత్యున్నత చట్టసభలకు వేర్పాటువాదులు

అత్యున్నత చట్టసభలకు వేర్పాటువాదులు

18వ లోక్ సభ ఎన్నికల్లో ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు ఎన్నిక కాగా ఇద్దరు మాత్రం వార్తల్లో వ్యక్తులుగా నిలిచారు. పంజాబ్‌లోని ఖదూర్‌ సాహిబ్‌ నుంచి గెలిచిన అమృత్‌పాల్‌ సింగ్‌, జమ్మూ కాశ్మీర్ లోని బారాముల్లా నుంచి గెలిచిన ఇంజనీర్ రషీద్ లు జైలులో ఉన్నా ప్రజల మనసు చురగొన్నారు. పెరోల్ మీద వచ్చిన ఇద్దరు ఎంపిలు జూలై 5న లోక్ సభ స్పీకర్ చాంబర్ లో ప్రమాణ స్వీకారం చేశారు.

జమ్ముకశ్మీర్ టెర్రర్‌ ఫండింగ్‌ కేసులో అరెస్టై ప్రస్తుతం జైల్లో ఉన్న అవామీ ఇత్తెహాద్ పార్టీ(AIP) నాయకుడు షేక్ రషీద్ అహ్మద్ / ఇంజనీర్ రషీద్.. ఎంపీగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో తీహార్ జైలు నుంచి పోటీ చేశారు. అంతకు ముందు లంగాటే అసెంబ్లీ స్థానంలో గెలిచి ఎమ్మెల్యేగా సేవలందించారు.

బారాముల్లా నుంచి మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బరిలో దిగగా… అనూహ్యంగా ఇంజినీర్‌ రషీద్‌.. రెండు లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచారు. మరో ప్రత్యర్థి సజ్జద్ లోన్ ఓటమి పాలయ్యారు. హురియత్ కాన్ఫరెన్స్ నేత అబ్దుల్ ఘని లోన్ కుమారుడు సజ్జాద్ లోన్.  నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (NIA) అంగీకారం తెలుపడంతో.. ఈ నెల 5న రెండు గంటల కస్టడీ పెరోల్‌ మంజూరు చేసింది. ఇంజినీర్‌ రషీద్‌ 2017లో జమ్ముకశ్మీర్‌ టెర్రర్‌ ఫండింగ్‌ కేసులో అరెస్టయ్యారు. అప్పటి నుంచి విచారణ ఎదుర్కొంటూ జైల్లో ఉంటున్నారు.

జమ్మూకాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు తర్వాత అంతా సజావుగా ఉన్నట్టు కనబడుతున్నా… వేర్పాటువాదం చాప కింద నీరులా విస్తరిస్తోంది. గతంలో అధికారం కోసం ఆజాదీ నినాదం వినిపించిన నేతలను కాకుండా వేర్పాటువాద సానుభుతిపరులనే చట్టసభలకు పంపటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

పంజాబ్‌లోని ఖదూర్‌ సాహిబ్‌ నియోజకవర్గం నుంచి ఖలిస్థాన్‌ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌ విజయం సాధించాడు. వారిస్‌ పంజాబ్‌ దే అధిపతిగా ఉన్న అమృత్‌పాల్‌ సింగ్‌ ను ఫిబ్రవరి 23న నాటకీయ ఫక్కీలో పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడు ధిబ్రూగఢ్‌ జైలులో ఉన్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో జైలు నుంచే పోటీ చేసి విజయం సాధించగా… ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అమృత్‌సర్‌ కోర్టు అనుమతించింది.

కొద్ది రోజులుగా కెనడా, అమెరికా, యుకె తదితర దేశాల్లోని ఖలిస్థాని సానుభుతుపరులు భారత వ్యతిరేకత వెళ్లగక్కుతున్నారు.  పశ్చిమ దేశాల్లో భారత్ పై అక్కసు వెళ్లగక్కే వారిలో పాకిస్తానీ మూలాలున్న సిక్కులు అధికం. వారి అనుచర వర్గం వివిధ సంస్థల ద్వారా పంజాబ్ లో ఆందోళనలకు దిగటం అలజడి సృష్టిస్తోంది.

వేర్పాటువాదులుగా ముద్ర పడ్డ ఇద్దరు వ్యక్తులు ఎన్నికల్లో గెలవటం సంచలనంగా మారింది. గతంలో వేర్పాటువాదుల సానుభూతిపరులు చట్టసభలకు గెలిచి వచ్చారు. అవినీతి ఆరోపణలతో జైలు నుంచి పోటీ చేసి గెలిచిన నేతలున్నారు. ఇందుకు విరుద్దంగా భారత ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రత్యక్షంగా కార్యకలాపాలు నిర్వహించే వ్యక్తులు దేశ అత్యున్నత చట్టసభలకు రావటం రాజకీయ పరిశీలకులను నివ్వెరపరిచింది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్