Saturday, January 18, 2025
HomeTrending Newsమతిమరుపు బైడెన్.. తలపట్టుకుంటున్న డెమోక్రాట్లు

మతిమరుపు బైడెన్.. తలపట్టుకుంటున్న డెమోక్రాట్లు

అధ్యక్షుడు జో బైడెన్ ప్రవర్తనతో అగ్రరాజ్యం ప్రతిష్ట అభాసుపాలవుతోంది. స్వదేశంలో, అంతర్జాతీయ వేదికలపై బైడెన్ వ్యవహారంతో మీడియాలో హాస్య కథనాలు అమెరికా పరువు మంటగలిపే విధంగా తయారైంది. ఈ ఏడాది నవంబర్‌ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి అధ్యక్ష పీఠం కోసం మరోసారి పోటీ పడుతున్న ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ కొంత కాలంగా మతిమరుపు, తడబాట్లతో పతాక శీర్షికలకు ఎక్కారు. ఇప్పుడు మరోసారి అదే పొరపాటు చేసి మీడియాకు చిక్కారు.

నాటో కూటమి దేశాల వార్షిక సదస్సు ముగిసిన అనంతరం బైడెన్‌ గురువారం మీడియాతో మాట్లాడారు. వైస్‌ ప్రెసిడెంట్‌ కమలా హారిస్‌ అనబోయి.. ఉపాధ్యక్షుడు ట్రంప్‌ అని సంభోదించారు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని ప‌రిచ‌యం చేస్తున్న స‌మ‌యంలో ‘ఉక్రెయిన్‌ ప్రెసిడెంట్ పుతిన్ అన్నారు.

అట్లాంటాలోని సీఎన్‌ఎన్‌ హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన తొలి ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌ లో రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌(78) వాగ్ధాటికి డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌(81) తడబడ్డారు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం, వలసలు, ఎకానమీ తదితర అంశాలపై డెమోక్రాటిక్‌ పార్టీ విధానాలు, నిర్ణయాలపై సమర్థంగా వాదన వినిపించలేకపోయారు.

అంతకుముందు ఇట‌లీలో జరిగిన జీ7 స‌మావేశాల్లో గ‌మ్మ‌త్తుగా ప్ర‌వ‌ర్తించారు. ఇట‌లీ ప్ర‌ధాని జార్జియా మెలోనీని వేదికపై క‌లిసేందుకు వెళ్లిన బైడెన్ సెల్యూట్ చేశారు. జీ7 నేత‌లు అంతా ఒక ద‌గ్గ‌ర ఉండ‌గా.. బైడెన్ ఒక్క‌రే మ‌రో వైపు వెళ్లి ఎవ‌రూ లేని దిశ‌కు థమ్స్ అప్ చూపించారు. ఆ స‌మ‌యంలో ఇట‌లీ ప్ర‌ధాని మెలానీ సమయ స్పూర్తితో వ్యవహరింఛి..  గ్రూప్ నేత‌ల‌ ద‌గ్గ‌ర‌కు తీసుకొచ్చారు.

శ్వేత‌సౌధంలో సంగీత కార్యక్రమం జ‌రుగుతుండగా బైడెన్ ఎటూ క‌ద‌ల‌కుండా చ‌ల‌నం లేని రీతిలో నిలుచున్నారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న ప‌క్క‌నే ఉన్న ఉపాధ్య‌క్షురాలు క‌మ‌లా హారిస్‌, ఆమె భ‌ర్త డ్యాన్స్ చేస్తూ క‌నిపించారు. బైడెన్ త‌దేకంగా చూస్తుండటాన్ని  రిప‌బ్లిక‌న్లు త‌ప్పుప‌ట్టారు. బిడెన్ అధ్యక్షుడు అయిన నాటి నుంచి ఇలాంటి సంఘటనలు కోకొల్లలు.

ఈ నేపథ్యంలో అధ్యక్ష అభ్యర్థి మార్పుపై డెమోక్రాటిక్ పార్టీలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.  బైడెన్‌ అభ్యర్థిగా ఎన్నికలకు వెళ్తే గెలవడం కష్టమని… పార్టీతో సుదీర్ఘకాలంగా అనుబంధం ఉన్న హాలీవుడ్‌ ప్రముఖ నటుడు, దర్శకుడు జార్జ్‌ క్లూనీ అన్నారు.

జో బైడెన్‌ డెమోక్రాటిక్‌ అభ్యర్థిత్వంపై వ్యతిరేక ప్రచారం జరుగుతుండగా, తాజాగా ఆయన మరో ప్రకటన సంచలనానికి దారితీసింది. తనకు నిద్ర సరిపోవట్లేదని, రాత్రి 8 గంటల తర్వాత ప్రచారంలో పాల్గొనలేనని, అర్ధరాత్రి షెడ్యూల్‌ వద్దని తన పార్టీ వారిని ఆదేశించినట్టు ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ తన కథనంలో పేర్కొంది.

ఇప్పటికే ప్రతి రాష్ట్రంలో పార్టీ అభ్యర్థిని ఎన్నుకునే ప్రతినిధుల ఎంపిక కోసం జరిగే ప్రైమరీ ఎన్నికలు పూర్తి అయ్యాయి. డెమోక్రాటిక్‌ పార్టీ నిబంధనల ప్రకారం.. రేసు నుంచి వైదొలుగుతున్నట్లు బైడెన్‌ స్వయంగా చెబితే తప్ప.. అభ్యర్థి మార్పు సాధ్యం కాదు. వీరంతా ఆయనకే మద్దతివ్వాల్సి ఉంటుంది. బిడెన్ అందుకు సుముఖంగా లేరు.

ఇటీవల పలు సందర్భాల్లో అధ్యక్ష రేసు నుంచి తప్పుకునేది లేదని బైడెన్ తేల్చి చెప్పటంతో డెమోక్రాట్లు తలపట్టుకుంటున్నారు. పార్టీకి భూరి విరాళాలిచ్చిన దాతలు సైతం అభ్యర్థి మార్పును కోరుతుండడంతో సీనియర్‌ డెమోక్రాట్లకు ఏంచేయాలో పాలుపోవడం లేదు.

సీనియర్‌ జర్నలిస్టుల సమక్షంలో అధ్యక్ష అభ్యర్థులు బహిరంగ చర్చలో పాల్గొనడం రివాజు. గతంలో మూడుసార్లు ఈ చర్చలు జరిగేవి. ఈసారి ట్రంప్‌, బైడెన్‌ రెండింటికే అంగీకరించారు. మొదటి చర్చ సీఎన్‌ఎన్‌ ఆధ్వర్యంలో జరుగగా.. త్వరలో జరిగే రెండో చర్చను ఏబీసీ న్యూస్‌ నిర్వహించనుంది. ఆ లోపే అధ్యక్ష రేసు నుంచి బైడెన్ తప్పుకోవాలని భావిస్తే ఆ స్థానంలో ఉపాధ్యక్షురాలు కమలా హరీస్‌ను పార్టీ ప్రతిపాదించే అవకాశముంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్