బాలయ్య తన కెరియర్లో ఎప్పుడూ కూడా గ్యాప్ రాకుండా చూసుకున్నారు. అలాగే తన సినిమాల్లో మాస్ అంశాలు మిస్సవ్వకుండా జాగ్రత్తపడుతూ వచ్చారు. బాలయ్య సినిమా అంటే భారీతనానికి లోటు ఉండదనే ఒక నమ్మకాన్ని కలిగించారు. ఈ మధ్య కాలంలో ఆయన ఒకదానికి మించి మరొకటి విజయాలను అందిస్తూ వచ్చారు. అలాంటి బాలయ్య తాజా చిత్రం ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే చాలావరకూ ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంది.
ఈ సినిమాకి తదుపరి షెడ్యూల్ ను రాజస్థాన్ లో ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. రాజస్థాన్ లో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను ప్లాన్ చేశారట. రెండు వారాల పాటు యాక్షన్ దృశ్యాలను చిత్రీకరించనున్నారు. డిఫరెంట్ గా డిజైన్ చేసిన ఈ యాక్షన్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. బాలయ్య అభిమానులు విజిల్స్ వేసేలా తెరపై ఈ యాక్షన్ సీన్స్ అలరిస్తాయని చెబుతున్నారు. ఈ ఎపిసోడ్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారని టాక్.
సితార బ్యానర్ పై ఇంతవరకూ వచ్చిన భారీ బడ్జెట్ సినిమాల జాబితాలో ఈ సినిమా కూడా చేరనుంది. ప్రగ్యా జైస్వాల్ ప్రధానమైన కథానాయికగా నటిస్తుండగా, మిగతా ముఖ్యమైన పాత్రలలో ఊర్వశి రౌతేలా .. మీనాక్షి చౌదరి గ్లామర్ టచ్ ఇవ్వనున్నారు. బాలకృష్ణ బందిపోటుగా ఈ సినిమాలో కనించనున్నాడని అంటున్నారు. ఇది ఈ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తించే అంశంగా మారిపోయింది. ఈ సినిమాకి ‘వీర మాస్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. దానినే ఖరారు చేస్తారేమో చూడాలి మరి.