Saturday, November 23, 2024
HomeTrending Newsయుద్ధప్రాతిపదికన బుడమేరు గండి పూడ్చివేత

యుద్ధప్రాతిపదికన బుడమేరు గండి పూడ్చివేత

ఇటీవలి వరదలకు విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేసిన బుడమేరు గండి పూడ్చివేత పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. గండ్లు పడిన చోట 500 క్యూసెక్కుల నుండి 200 క్యూసెక్కులకు సీపేజ్ లీకేజ్ తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. బుడమేరు కు వస్తున్న వరద ఉధృతిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ సూచనలు ఇస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ఉండి పనులను పర్యవేక్షిస్తున్న ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో సమన్వయం చేసుకుంటూ పనులు మరింత వేగవంతం అయ్యేలా చర్యలు చేపట్టారు. పూర్తి స్థాయిలో లీకేజ్ అరికట్టేందుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని అధికారులను లోకేష్ ఆదేశించారు.

లీకేజ్ అరికట్టేందుకు అధికారులు జియో మెంబ్రేన్ షీట్ వినియోగిస్తున్నారు. ఈ  సాయంత్రానికి పూర్తి స్థాయిలో లికేజ్ నియంత్రణలోకి వస్తుందని అధికారులు ధీమాగా ఉన్నారు. ఓవైపు వస్తున్న వరదను అంచనా వేస్తూ మరోవైపు గండ్లు పూడ్చిన చోట కట్ట ఎత్తు పెంచే పనులు వేగవంతం చేశారు. ఇప్పటికే గండ్లు పడిన చోట 5.7 మీటర్ల ఎత్తు పెంచగా మరో 0.3 మీటర్ల ఎత్తు పెంచితే ప్రస్తుత కట్ట స్థాయికి పనులు పూర్తవుతాయని అధికారులు వివరించారు.

బుడమేరు వద్ద జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు డ్రోన్ ద్వారా పర్యవేక్షిస్తూ పనులు వేగవంతం చెయ్యడానికి వివిధ శాఖల అధికారులతో  మంత్రులు సంప్రదింపులు చేస్తున్నారు.  దీనితో పాటు వరద బాధితులకు అందుతున్న సహాయం, నష్ట పరిహార అంచనాపై  కూడా యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనికోసం ప్రత్యేకంగా మొత్తం 36 మంది ప్రజాప్రతినిధులను రంగంలోకి దించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్